
కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో చేట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) గుడువును ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఓటర్ల జాబితా గణన కోసం డిసెంబర్ 4 వరకు అధికారులకు ఈసీ సమయం ఇచ్చింది. అయితే ఇప్పుడు దానికి డిసెంబర్ 16 వరకు పొడిగించింది. తుది జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమాశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో ఓటర్ల సవరణపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో ఈసీ గడువు పొడిగించడం చర్చనీయాంశమైంది.
డిసెంబర్ 9న విడుదల కావాల్సిన ఓటర్ల ముసాయిదా జాబితాను డిసెంబర్ 16న ప్రచురిస్తామని, తుది జాబితాను ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని ఈసీ తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు ఇటీవల ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కలిశారు. ఈ భేటీలో SIR ప్రక్రియను రీషెడ్యూల్ చేయాలని కోరారు .బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి పనిని పూర్తి చేయడానికి ఒత్తిడిలో ఉన్నారని, ఈ కార్యక్రమాన్ని మెరుగైన రీతిలో ప్లాన్ చేయాలని కోరారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో బీఎల్‌వోల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఈసీని కలిసి తిరిగి షెడ్యూల్ చేయాలని అభ్యర్ధించారు.
కాగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల్లో ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఈసీ భారీ ఎత్తున చేపట్టింది. వచ్చే ఏడాది ప్రారంభంలో పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి సీఎం మమతా బెనర్జీ ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్‌లో నవంబర్ 29 సాయంత్రం వరకు ప్రస్తుత ఓటర్ల జాబితాలో మరణించిన 18.70 లక్షల మంది ఓటర్లను ఈసీ గుర్తించింది. ఇంకా నకిలీ ఓటర్లు, జాడ తెలియని ఓటర్లు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి నివసించిన ఓటర్లను కూడా లెక్కలోకి తీసుకుంటే ఆ సంఖ్య 35 లక్షల వరకు చేరుకునే అవకాశముందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.