
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కోఖ్రాజ్ టోల్ ప్లాజా సమీపంలో ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా క్షణాల వ్యవధిలోనే భారీ అగ్నిగోళంగా మారింది. ఈ భయానక దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ప్రత్యక్షంగా రికార్డయ్యాయి.
అధికారుల కథనం ప్రకారం.. వేగంగా వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకై, కేవలం కొన్ని సెకన్లలోనే ఆకాశమంత ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి టోల్ ప్లాజా కేబిన్లు, సమీపంలో ఉన్న వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో టోల్ సిబ్బందితో పాటు ప్రయాణికులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేసి, గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..