Viral Videos: పోలీసులను కర్రలతో కొట్టి.. కారుకు నిప్పంటించి.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్.. అసలు ఏమైందంటే..

|

Sep 14, 2022 | 12:44 PM

పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటున్న పరిస్థితులే ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్నికలు పూర్తై ఏడాది గడుస్తున్నా.. హింసాత్మక ఘటనలకు ఫుల్ స్టాప్ పడటంలేదు. తాజాగా..

Viral Videos: పోలీసులను కర్రలతో కొట్టి.. కారుకు నిప్పంటించి.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్.. అసలు ఏమైందంటే..
Burning Car
Follow us on

Viral News: పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటున్న పరిస్థితులే ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్నికలు పూర్తై ఏడాది గడుస్తున్నా.. హింసాత్మక ఘటనలకు ఫుల్ స్టాప్ పడటంలేదు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనను వ్యతిరేకిస్తూ బీజేపీ చేపట్టిన ‘చలో సచివాలయం’ నిరసన హింసాత్మకంగా మారింది. పోలీసుల అనుమతి లేకపోయినా చలో సెక్రటరేటియట్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో రాజధాని కోల్‌కతాతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకొన్నాయి. కొన్ని చోట్ల నిరసనకారులను అడ్డుకొనేందుకు వచ్చిన పోలీసులపై భౌతిక దాడులు జరగడం వివాదాస్పదంగా మారింది. కోల్‌కతాలో ఓ పోలీసును బీజేపీ జెండాలు పట్టుకున్న ఆందోళనకారులు కర్రలతో కొట్టిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ర్యాలిని అడ్డుకునేందుకు వచ్చిన ఓ పోలీసుని బీజేపీ జెండాలు పట్టుకున్న నిరసనకారులు చుట్టుముట్టారు. కర్రలతో పోలీసు డ్రెస్ వేసుకున్న వ్యక్తిపై విచక్షణారహితంగా దాడిచేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీసు అక్కడి నుంచి పరుగులు తీసినప్పటికీ.. ఆందోళనకారులు వెంబడించి వెళ్లి.. ఆయనపై దాడికి దిగారు. ఆ తర్వాత కొందరు స్థానికులు వారిని అడ్డుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. దీంతో బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ వీడియోను టీఎంసీ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. బీజేపీ నిజస్వరూపం బయటపడింది. రాఖీ పండుగ రోజున బీజేపీ నాయకులు పోలీసులకు రాఖీలు కట్టి వారితో ఫొటోలు దిగారు. మిగిలిన రోజుల్లో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇదేనా పోలీసులకు మనమిచ్చే గౌరవం.. ఎండనకా.. వాననకా ప్రజలను రక్షించడం కోసం పనిచేస్తోన్న వారిపై ఇటువంటి దాడులు జరగడం విచారకరం అంటూ ట్విట్టర్ లో టీఎంసీ మండిపడింది. అయితే, ఈ వీడియోపై బీజేపీ నాయకులు స్పందించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న నిరసనకారులపైకి పోలీసులు రాళ్లు విసిరి రెచ్చగొట్టారని కేంద్రమంత్రి సుభాష్‌ సర్కార్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు.. పోలీసు వాహనానికి ఆందోళనకారులు నిప్పుపెడుతున్న క్లోజ్‌అప్‌ వీడియోను కాంగ్రెస్‌ నాయకులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈవీడియోలో ఓ వ్యక్తి సిగరెట్‌ లైటర్‌తో కారుకు నిప్పంటిస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోను షేర్‌ చేస్తూ బీజేపీ పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. కారుకు నిప్పంటించిన వారు భాజపా కార్యకర్తలు కాదని.. పోలీసులే ఇదంతా చేసి ఉండొచ్చని బీజేపీ నేత సువేందు అధికారి తెలిపారు. మొత్తం మీద ఈరెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..