
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో శనివారం ఉదయం ఓ చెట్టుకు యువకుడు, యువతి మృతదేహాలు వేలాడుతూ కనిపించడం కలకలం రేపింది. బనియతీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైంజని గ్రామం వెలుపల ఉన్న పొలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను కిందకు దించి, ఆధారాలను సేకరించారు.
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. మృతులు ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. వారి ఇళ్లు కూడా సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం (సెప్టెంబర్ 18) రాత్రి నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు వారి కోసం వెతుకుతుండగా.. శనివారం ఉదయం పొలం వైపు వెళ్లిన గ్రామస్థులకు చెట్టుకు వేలాడుతున్న వారి మృతదేహాలు కనిపించాయి. విషయం గ్రామ పెద్దకు తెలియజేయడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
మూడు నెలలుగా ప్రేమ వ్యవహారం?
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరి మధ్య సుమారు మూడు నెలలుగా ప్రేమ సంబంధం ఉన్నట్లు సమాచారం. సావన్ జాతరలో వీరిద్దరూ కలుసుకున్నారని, అనంతరం పెళ్లి చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఆగస్టులో వారి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుడైన యువకుడు కుటుంబానికి ఏకైక కుమారుడని, చందౌసిలోని ఆర్ఎస్ ఇంటర్ కాలేజీలో 11వ తరగతి చదువుతున్నట్లు సమాచారం. యువతి తన కుటుంబంలో అందరికంటే చిన్నదిగా తెలుస్తోంది.
పోస్ట్‌మార్టం తర్వాతే అసలు కారణం
ఘటనపై సమాచారం అందుకున్న చందౌసి సీఓ, బనియతీర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించే ప్రక్రియ చేపట్టారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ఆత్మహత్యా, మరేదైనా కారణమా అనే విషయంపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక, దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా మరణాలకు అసలు కారణం స్పష్టమవుతుందని సంభాల్ ఎస్పీ వికాస్ చంద్ర త్రిపాఠి తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..