మీర్జాపుర్, నవంబర్ 22: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనను కరచిన పామును సంచిలో భద్రంగా ఆసుపత్రికి తీసుకొచ్చి.. వైద్యం చేయాలంటూ ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. సంచిలోనుంచి పామును బయటికి తీసి దానిని వైద్యులకు చూపుతూ తనను కరచిన పాము ఇదేనంటూ నాగుపామును చూపసాగాడు. వెంటనే తనకు ఇంజెక్షన్ చేయాలంటూ సదరు యువకుడు హల్‌చల్ చేసిన ఘటన స్థానికంగా చర్చణీయాంశంగా నిలిచింది. ఆసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లోని లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతుల్ఖీ గ్రామానికి చెందిన సూరజ్ అనే యువకుడిని అతని ఇంటివద్ద సోమవారం సాయంత్రం ఓ నాగుపాము కాటు వేసింది. సూరజ్ భయపడకుండా తనను కాటువేసిన పామును సంచిలో బంధించాడు. అనంతరం ఆ పాము ఉన్న సంచిని తీసుకుని సమీపంలోని మీర్జాపుర్ ప్రభుత్వ ఆసుపత్రికి బైక్‌పై వెళ్లాడు. వెంటనే ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుని తానను పాము కాటు వేసిందని వెంటనే వైద్యం చేయాలంటూ డాక్టర్లను కోరాడు. అతన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బాధితుడు నీట్‌గా సూటుబూటు వేసుకుని టిప్‌టాప్‌గా వచ్చాడు మరీ.
వెంటనే తన వద్ద ఉన్న సంచిలోనుంచి పామును తీసి ఎమర్జెన్సీ వార్డు బెడ్‌పై ఉంచి ‘ఈ పామే నన్ను కరిచింది’ అంటూ వివరించసాగాడు. అనంతరం ఆ పామును తిరిగి సంచిలో భద్రపరిచాడు. అనుకోని ఈ హఠత్పరిణామానికి ఆసుపత్రిలో ఉన్న వైద్యులు, స్టాఫ్‌తో సహా అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. పామును చూపి తక్షణమే తనకు ఇంజెక్షన్ ఇవ్వాలని సూరజ్ వైద్యులను కోరాడు. అనంతరం సూరజ్‌కు వైద్యులు యాంటీవీనమ్ ఇంజెక్షన్ ఇచ్చి, చికిత్స చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.