
సంచలనం సృష్టించిన రూ. 1.3 కోట్ల భారీ దోపిడీ కేసును ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. నాగఫణి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హైప్రొఫైల్ క్రైమ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఇత్తడి వ్యాపారి సొంత కుమార్తె అని తేలడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ప్రియుడితో కలిసి ఆమె ఈ వికృత కుట్రకు తెరలేపినట్లు విచారణలో వెల్లడైంది.
మే 11వ తేదీ రాత్రి, మొరాదాబాద్ జిల్లాలోని నాగఫణి పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ కాంపౌండ్‌లో నివసించే ప్రముఖ ఇత్తడి వ్యాపారి ఇమ్రాన్ ఇంట్లోకి సాయుధ దుండగులు చొరబడ్డారు. తుపాకులతో కుటుంబ సభ్యులను బెదిరించి, బందీలుగా మార్చారు. ఇంట్లోని బీరువాల్లో దాచిన భారీ నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకుని క్షణాల్లో పరారయ్యారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. శాంతిభద్రతలకు సవాల్‌గా మారిన ఈ కేసు తీవ్రతను గుర్తించిన ఎస్‌ఎస్‌పి సత్పాల్ అంతిల్, నిందితులను పట్టుకోవడానికి వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.
పోలీస్ సూపరింటెండెంట్ నాగర్ కుమార్ రణ్‌విజయ్, కోత్వాలి సర్కిల్ ఆఫీసర్ సునీతా దహియా నేతృత్వంలోని బృందాలు ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టాయి. ఎలక్ట్రానిక్ నిఘా, రహస్య సమాచార నెట్‌వర్క్‌లను క్రియాశీలం చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో విచారణ జరిపిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా నిందితులను గుర్తించి.. అర్షద్ వార్సి, కుల్దీప్, రవి కుమార్, నిక్కీలతో పాటు వ్యాపారవేత్త 21 ఏళ్ల కుమార్తె అరిబాను అరెస్టు చేశారు.
నిందితులను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వ్యాపారి కుమార్తె అరీబా, నిందితుడు అర్షద్ వార్సీ గత 8-9 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇరు కుటుంబాలు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవి కావడంతో వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో కుటుంబంపై పగ పెంచుకున్న అరీబా, ప్రియుడితో కలిసి ఇంట్లోనే దోపిడీకి ప్లాన్ చేసింది.
తన తండ్రి వ్యాపార లావాదేవీలు, ఇంట్లో ఉండే నగదు, కుటుంబ సభ్యుల కదలికలపై అరీబా నిరంతరం అర్షద్‌కు సమాచారం అందించేది. నెల రోజుల క్రితమే ఇంటి తాళాలను కూడా ప్రియుడికి ఇచ్చింది. ఘటన జరిగిన రాత్రి ఎవరికీ అనుమానం రాకుండా ప్రధాన ద్వారం తెరిచింది అరీబానే. ఆమె ఇచ్చిన సిగ్నల్‌తో అర్షద్ తన అనుచరులతో కలిసి ఇంట్లోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డాడు.
ఈ కేసులో నిందితుల నుంచి పోలీసులు రూ. 4,72,400 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, నాలుగు అక్రమ పిస్టళ్లు, సజీవ తూటాలు, నేరానికి ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసును రికార్డు సమయంలో ఛేదించిన నాగఫణి ఇన్‌స్పెక్టర్ రాకేష్ కుమార్ బృందాన్ని ఎస్ఎస్పీ సత్పాల్ అంతిల్ అభినందించారు. ఎంతటి పెద్ద నేరగాళ్లనైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..