IND vs US: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేవీకి చెందిన యుద్ధ నౌకలు భారతదేశ అనుమతి లేకుండానే భారత జలాల్లోకి ప్రవేశించాయి. లక్షద్వీప్ దీవుల సమీపానికి చేరుకున్నాయి. భారత జలాలు వేదికగా ‘నేవి ఇండిపెండెన్స్’పై ప్రచారాన్ని ప్రారంభించాయి. ‘నావిగేషన్ ఆపరేషన్ ఫ్రీడమ్’ కింద భారత జలాల్లోకి వచ్చినట్లు యూఎస్ నేవి ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ చర్య ఇండో-యూఎస్ సంబంధాలను ప్రభావితం చేస్తుందని పలువురు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉంటే.. ఏప్రిల్ 7, 2021న యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్(డిడిజి53) నౌక భారత అనుమతి లేకుండా భారత జలాల్లోకి ప్రవేశించింది. పశ్చిమాన ఉన్న లక్షద్వీప్ సమూహానికి చేరుకుంది. యూఎస్‌కు చెందిన ఏడవ నౌకాదళ కమాండర్ ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. భారత భూభాగానికి 130 నాటికల్ మైళ్ల దూరంలో నేవీ హక్కులు, స్వేచ్ఛ అనే అంశంపై ప్రచారాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టం ప్రకారమే దీనిని నిర్వహించడం జరిగిందన్నారు.
అయితే, ఏదేశ నేవీ అయినా.. మరో దేశ జలభాగంలోకి ప్రవేశించాలంటే ముందుగా ఆ దేశ అనుమతి తీసుకోవాల్సిందే. కానీ.. యూఎస్ నేవీ మాత్రం అలా చేయలేదు. పైగా అంతర్జాతీయ చట్టం అంటూ ప్రకటనలు చేయడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే, యూఎస్ నేవీ చేసిన తాజా ప్రకటనపై దేశ రక్షణ శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి అమెరికా భారత్‌కు అత్యంత సన్నిహిత, వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలలో ఒకటి. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తరణ వాదాన్ని ఇరు దేశాలూ వ్యతిరేకించాయి కూడా. ఇదే సమయంలో భారత్-అమెరికా దేశాలకు చెందిన నావికాదళాలు ఏడాది పొడవునా విన్యాసాలు చేస్తూనే ఉంటాయి. అయితే, భారతదేశ ప్రాదేశిక జలాలలో సైనిక విన్యాసాలు చేయాలన్నా, సదరు యుద్ధ నౌకలు దేశ జలాల్లోకి ప్రవేశించాలన్నా భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, యూఎస్ నేవీ మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.
భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు..
భారత ప్రాదేశిక జలాల్లోకి యూఎస్ నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు ప్రవేశించడంపై ఇండియన్ నేవీ, విదేశాంగ మంత్రిత్వ శాఖల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ మౌనానికి కారణం ఉందంటున్నారు రక్షణరంగ నిపుణులు. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్వాడ్ గ్రూప్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ గ్రూప్‌లోని సభ్యదేశాలు పరస్పర సహకరాన్ని అందించుకోవడంతో పాటు.. ఇండో-పసిఫిక్ సముద్రంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలని ప్రతిజ్ఞ కూడా చేశాయి. ఈ నేపథ్యంలో నావిగేషన్ స్వేచ్ఛ, ప్రాదేశిక సమగ్రత పేరుతో యూఎస్ నౌకాదళం భారత జలాల్లోకి ప్రవేశించినట్లుగా భావిస్తున్నారు. కాగా, క్వాడ్ గ్రూప్‌లో అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఉన్న విషయం తెలిసిందే. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును కట్టడి చేయడమే ఈ గ్రూప్ లక్ష్యం.
Also read:
WB Polls 2021: మైనార్టీలకు మమత చేసిందేమీ లేదు…దీదీపై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్
Prince Philip death: బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ IIకు పతీవియోగం… ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత