
నీట్ పేపర్ లీక్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లతో సమావేశమయ్యారు. సమావేశంలో సీజేపీ ప్రతినిధులు మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి సమర్పించారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తొలగించడం, నిరాహార దీక్ష అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను విడుదల చేయాలని కోరారు. మూడో డిమాండ్ కింద పరీక్షల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు తలా రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సమావేశం అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ.. సీజేపీ ప్రతినిధి బృందం సమర్పించిన వినతిపత్రాన్ని స్వీకరించామని, అందులోని అంశాలను పార్టీ నాయకత్వంతో చర్చిస్తామని తెలిపారు. అలాగే నిరసనకారులు శాంతియుతంగా తమ ధర్నాను విరమించి సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని సీజేపీ నాయకులు పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఈ ఉద్యమం పార్లమెంట్ వైపు సాగుతుండగా, పోలీసులు అనుమతి లేదని పేర్కొంటూ నిరసనకారులను అడ్డుకున్నారు. కొందరు బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనల్లో కొంతమంది నిరసనకారులు, భద్రతా సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని కొన్ని మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసి, కేంద్ర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి