Amit Shah: డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్’ను ప్రారంభించిన అమిత్‌ షా

Amit Shah: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మన దేశం ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉందని, రాబోయే మూడేళ్లు వ్యసనం మనల్ని ఓడిస్తుందా లేదా మనం వ్యసనాన్ని ఓడిస్తామా అనేదాన్ని నిర్ణయిస్తాయని అమిత్ షా అన్నారు. రాబోయే 100 ఏళ్ల దేశ..

Amit Shah: డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్ను ప్రారంభించిన అమిత్‌ షా
Amit Shah

Updated on: Jun 26, 2026 | 8:33 PM

Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా శుక్రవారం న్యూ ఢిల్లీలో ‘ఆన్‌లైన్ డ్రగ్స్ డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్’ను ప్రారంభించారు. ఈరోజు జరిగిన నార్కో-కోఆర్డినేషన్ సెంటర్ (NCORD) 10వ అత్యున్నత స్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి ‘విజన్ డాక్యుమెంట్ ఆన్ డ్రగ్ కంట్రోల్ (2026-2029)’, ‘ఎన్‌సిబి (NCB) వార్షిక నివేదిక-2025’లను విడుదల చేశారు. అలాగే జమ్మూ, గువహటిలలో ఎన్‌సిబి జోనల్ కార్యాలయాలను ఈ-ప్రారంభోత్సవం చేశారు. అలాగే షా రూ.6,000 కోట్ల విలువైన 2,09,500 కిలోల మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ‘ఆన్‌లైన్ డ్రగ్స్ డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్’ కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మన దేశం ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉందని, రాబోయే మూడేళ్లు వ్యసనం మనల్ని ఓడిస్తుందా లేదా మనం వ్యసనాన్ని ఓడిస్తామా అనేదాన్ని నిర్ణయిస్తాయని అన్నారు. రాబోయే 100 ఏళ్ల దేశ భవిష్యత్తు కోసం దృఢ సంకల్పంతో ఉమ్మడి కృషితో ఈ యుద్ధంలో విజయం సాధించాలని పేర్కొన్నారు. ఈ పోరాటాన్ని ఏదో ఒక విభాగం, రాష్ట్రం, ప్రభుత్వం లేదా వ్యక్తి ఒంటరిగా చేయలేరని అన్నారు. అన్ని రాష్ట్రాలు, వాటి సంబంధిత విభాగాలు ఒకే వేదికపైకి రావాలని అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో ప్రజలను ఉత్తేజపరిచే వ్యక్తులను, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతను, మన మహిళా శక్తిని భాగస్వాములను చేయాలని, అప్పుడే ఈ యుద్ధంలో పూర్తి విజయం సాధించగలమని అన్నారు. మాదకద్రవ్యాల సమస్య కేవలం శాంతిభద్రతలు లేదా ప్రజారోగ్యానికి సంబంధించినది మాత్రమే కాదని, ఇది దేశ అంతర్గత భద్రత, సామాజిక స్థిరత్వం, ఆర్థిక ప్రయోజనాల రక్షణ, యువత భవిష్యత్తుతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యపై పూర్తి విజయం సాధించడం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ఉమ్మడి జాతీయ లక్ష్యం కావాలన్నారు.

డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు, వ్యవస్థీకృత నేరాలు, నార్కో-టెర్రర్ ఫైనాన్సింగ్, సరిహద్దు ఉగ్రవాద నెట్‌వర్క్‌ల నిధుల వంటి సమస్యలు నేడు ‘నార్కో-టెర్రరిజం ఎకోసిస్టమ్’గా రూపాంతరం చెందాయని అమిత్ షా అన్నారు. దేశ అంతర్గత భద్రత, ఆర్థిక వ్యవస్థ, యువత భవిష్యత్తు కోసం ఈ ముప్పుపై మనం పూర్తి విజయం సాధించాలన్నారు. భౌగోళికంగా మనం ‘డెత్ ట్రయాంగిల్’, ‘డెత్ క్రెసెంట్’ల మధ్య ఉన్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ స్మగ్లర్లు డ్రోన్ల ద్వారా చేరవేయడం, సముద్ర మార్గాల ద్వారా కంటైనర్ల ద్వారా రవాణా, డార్క్‌నెట్, క్రిప్టో పేమెంట్లు, ఆర్డర్-టు-డెలివరీ మోడల్స్, పార్శిల్ షిప్‌మెంట్లు వంటి అధునాతన పద్ధతులను అవలంబిస్తూ మన పోరాటాన్ని మరింత సవాలుగా మార్చారని చెప్పారు.

డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం

డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడేవారి పట్ల కఠినమైన వైఖరిని, డ్రగ్స్ బారిన పడిన బాధితుల పట్ల సానుభూతితో కూడిన వైఖరిని అవలంబించాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) వార్షిక నివేదికతో పాటు, ‘నషా ముక్త్ భారత్’ రోడ్‌మ్యాప్ విజన్ డాక్యుమెంట్‌ను కూడా ఆవిష్కరించారు. ఇప్పటివరకు 15,876 జిల్లా స్థాయి ఎన్‌కార్డ్ సమావేశాలు, 266 రాష్ట్ర స్థాయి సమావేశాలు, 7 కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయని అన్నారు.  ప్రధానమంత్రి మోదీ 2047 నాటికి ‘వికసిత్ భారత్’ విజన్‌ను నిర్దేశించారని, అలాగే ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యాన్ని కూడా ఇచ్చారని అమిత్ షా చెప్పారు.

డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం

మొత్తం నెట్‌వర్క్‌పై చర్యలు చేపట్టడం, దానిని పూర్తిగా నిర్మూలించడం దీని లక్ష్యమని తెలిపారు. విదేశాల నుండి దేశంలోకి డ్రగ్స్ తెచ్చేవారు, సరిహద్దుల నుండి రాష్ట్రాలకు సరఫరా చేసేవారు, రాష్ట్రాల నుండి వినియోగదారులకు పంపిణీ చేసేవారు ఇలా మూడు రకాల కార్టెళ్లను (ముఠాలను) నిర్మూలించడానికి సరిహద్దు, సున్నితమైన జిల్లాల్లో హ్యూమింట్, సాంకేతిక నిఘా, కమ్యూనిటీ పోలీసింగ్‌లను ఉపయోగించి ముందుకు సాగాలన్నారు.

రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

2004 – 2014 మధ్యకాలంలో రూ.40,000 కోట్ల విలువైన 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు. దీనికి విరుద్ధంగా 2014 నుండి 2026 వరకు రూ.1,84,000 కోట్ల విలువైన 1 కోటి 18 లక్షల కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇది మన ప్రచారం విజయవంతంగా ముందుకు సాగుతోందని నిరూపిస్తుందన్నారు. 2004 నుండి 2014 వరకు రూ.8,000 కోట్ల విలువైన (3,26,000 కిలోలు) డ్రగ్స్ ధ్వంసం చేయగా, 2014 – 2026 మధ్య రూ.89,896 కోట్ల విలువైన (42,47,000 కిలోలు) డ్రగ్స్ ధ్వంసం చేసినట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us