Viral Video: ఇదేందయ్యా ఇదీ.. ఎప్పుడు సూడలే.. విజయ్ రాలేదని ఈ అభ్యర్థి ఏం చేశాడంటే..?
తమిళనాడు రాజకీయాల్లో సినిమా గ్లామర్ కొత్తేమీ కాదు. కానీ ఒక అభ్యర్థి తన నాయకుడి మీద ఉన్న అభిమానంతో ఏకంగా ఆయన విగ్రహాన్నే పక్కన పెట్టుకుని నామినేషన్ వేయడం మాత్రం ఇదే మొదటిసారి. దళపతి విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థి చేసిన ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

కోలీవుడ్ దళపతి విజయ్ అంటే ఆయన అభిమానులకు అంతులేని పిచ్చి. సినిమా విడుదలైనా, పుట్టినరోజైనా భారీ కటౌట్లు, పాలభిషేకలతో తమిళనాడును హోరెత్తిస్తారు. అయితే ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి రావడంతో ఆ అభిమానం సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికల వేళ ఓ అభ్యర్థి చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తిరువేరుంపూర్ నియోజకవర్గం నుంచి TVK తరపున పోటీ చేస్తున్న నవల్పట్టు విజి, తన అభిమానాన్ని విభిన్నంగా చాటుకున్నారు. తన నామినేషన్ దాఖలు చేసే సమయంలో పార్టీ అధినేత విజయ్ తన వెంట ఉండాలని ఆయన ఆశించారు. కానీ విజయ్ రాజకీయ పనుల్లో బిజీగా ఉండటంతో విజి ఏకంగా విజయ్ తరహాలోనే ఉండే ఒక మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విగ్రహాన్ని తన వాహనంలో పక్కన కూర్చోబెట్టుకుని, ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— back-up (@MPbackuwp) April 7, 2026
ఈ విగ్రహం నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘నిజమైన విజయ్ రాకపోతే ఏంటి.. మా గుండెల్లో ఉన్న దైవం విగ్రహం రూపంలో వచ్చారు’’ అని కొందరు అంటుంటే, ఎన్నికల ప్రచారం కోసం ఈ డూప్ విజయ్ రాజకీయాలు ఏంటి? అని మరికొందరు విమర్శిస్తున్నారు.
🤭🤭🤭 ! pic.twitter.com/gAqzlDvvtN
— Gypsy 🎭 (@Gypsy_1809) April 7, 2026
జననాయగన్ విడుదలపై సస్పెన్స్
మరోవైపు విజయ్ తన సినీ కెరీర్‌కు గుడ్ బై చెబుతూ నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్ విడుదల కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా జనవరి 9నే విడుదల కావాల్సి ఉంది. కానీ రాజకీయ సమీకరణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికల హడావుడి ముగిసిన మరుసటి రోజే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ట్రైలర్ వివాదం.. కోర్టుకు చేరిన టిఎన్ 2026
ఇదిలా ఉండగా టీఎన్ 2026 సినిమా ట్రైలర్ విజయ్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. విజయ్ మేనరిజమ్స్, హెయిర్‌స్టైల్‌ను కాపీ కొట్టారని ఉమాపతి, తంబి రామయ్యలపై ఫ్యాన్స్ విమర్శలు కురిపిస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు కేవలం 13 రోజుల ముందు రాజకీయ నేపథ్యం ఉన్న టి.ఎన్.ఎ. 2026 చిత్రాన్ని విడుదల చేయవద్దని మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వివాదాలు సినిమాకు ఉచిత ప్రచారాన్ని కల్పిస్తున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి అటు రాజకీయాల్లో ఇటు వెండితెరపై విజయ్ నామస్మరణ తమిళనాడులో మార్మోగిపోతోంది. ఎన్నికల సంఘం ఈ సినిమాల విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
