బుమ్రా వేసిన నోబాలే కొంప ముంచిందన్న భువీ

| Edited By: Pardhasaradhi Peri

Jun 29, 2020 | 1:59 PM

క్రికెట్‌ ఆటే అనూహ్యం.. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. ఒక్క బంతి ఆట స్వరూపాన్నే మార్చేస్తుంది

బుమ్రా వేసిన నోబాలే కొంప ముంచిందన్న భువీ
Follow us on

క్రికెట్‌ ఆటే అనూహ్యం.. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. ఒక్క బంతి ఆట స్వరూపాన్నే మార్చేస్తుంది.. మూడేళ్ల కిందట పాకిస్తాన్‌తో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లోనూ ఇదే జరిగింది. ఆ మ్యాచ్‌ను రివైండ్‌ చేసుకున్న టీమిండియా మీడియం పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌కుమార్‌ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు..

జస్‌ప్రీత్‌ బుమ్రా వేసిన నోబాల్‌ మ్యాచ్‌ను పాకిస్తాన్‌ పరం చేసిందన్నాడు భువనేశ్వర్‌కుమార్‌. బుమ్రా వేసిన బాల్‌ను ఆడేందుకు తడబడిన ఓపెనర్‌ ఫకార్‌ జమాన్ కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చాడు.. కాకపోతే అది నోబాల్‌ కావడంతో ఫకార్‌ జమాన్‌ బతికిపోయాడు.. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఫకార్‌ 114 పరుగులు చేశాడు.. ఫలితంగా పాకిస్తాన్‌ 338 పరుగుల భారీ స్కోరు చేయగలింది.. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన తాము మాత్రం బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యామని చెప్పాడు భువనేశ్వర్‌కుమార్‌. తాము 158 పరుగులకే చాపచుట్టేసి 180 పరుగుల తేడాతో ఓటమి చెందామని భువీ చెప్పుకొచ్చాడు.. అది నోబాల్‌ కాకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.

ఆ మ్యాచ్‌ను తీసేస్తే ఓవరాల్‌గా టీమిండియా పర్‌ఫార్మెన్స్‌ గత కొన్నేళ్లుగా అద్భుతంగా ఉందన్నాడు భువీ. 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత మూడు నాలుగు ఐసీసీ టోర్నమెంట్లు జరిగాయని… అందులో మూడు సార్లు సెమీఫైనల్‌కు చేరామని, ఓసారి ఫైనల్లో అడుగుపెట్టామని భువీ వివరించాడు. నిరుడు జరిగిన ప్రపంచకప్‌లో కూడా తమను దురదృష్టం వెంటాడిందని, టాపార్డర్‌ విఫలం కావడం వల్లనే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఓటమిపాలయ్యామని భువనేశ్వర్‌కుమార్‌ తెలిపాడు.