Uddhav Thckeray: ఏక్నాథ్ షిండే వర్గానికి ముంబై కోర్టు షాక్.. శివాజీ పార్క్‌లో దసరా వేడుకలకు ఉద్ధవ్‌ థాక్రేకు అనుమతి..

Eknath Shinde - Uddhav Thackeray: దసరా వేడుకలను పురస్కరించుకొని మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే వర్గాల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ తారాస్థాయికి చేరింది.

Uddhav Thckeray: ఏక్నాథ్ షిండే వర్గానికి ముంబై కోర్టు షాక్.. శివాజీ పార్క్‌లో దసరా వేడుకలకు ఉద్ధవ్‌ థాక్రేకు అనుమతి..
Uddhav Thackeray
Follow us

|

Updated on: Sep 24, 2022 | 6:19 AM

Eknath Shinde – Uddhav Thackeray: దసరా వేడుకలను పురస్కరించుకొని మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే వర్గాల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ముంబైలోని శివాజీ పార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహణ విషయంలో ఏక్నాథ్ షిండే వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. శివాజీ పార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహించేందుకు ఉద్ధవ్ ఠాక్రే తన వర్గం శివసేనకు బొంబాయి హైకోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయం ఠాక్రే వర్గానికి తొలి విజయంగానూ, షిండే వర్గానికి పెద్ద దెబ్బగానూ రాజకీయ నాయకులు పరిగణిస్తున్నారు. ఇరువర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారిన ర్యాలీ నేపథ్యంలో కోర్టు థాక్రే శివసేనకు అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. థాక్రే శివసేనకు బాంబే హైకోర్టు అనుమతినివ్వడంతోపాటు పార్టీ ఎవరికి చెందాలనే వివాదం పరిష్కారమయ్యే వరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవద్దని శిందే వర్గం చేసిన అభ్యర్థనను కూడా ముంబై కోర్టు తోసిపుచ్చింది. ర్యాలీ నిర్వహించేందుకు శివసేనలోని రెండు వర్గాలు చేసిన దరఖాస్తులను బృహన్‌ ముంబయి నగరపాలక సంస్థ (BMC) తిరస్కరించడంతో ఈ విషయం బాంబే హైకోర్టుకు వెళ్లింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయనే కారణంతో బీఎంసీ.. ఇరు వర్గాలకూ అనుమతులను నిరాకరించింది. అయితే బీఎంసీ ఆర్డర్.. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అనంతరం ర్యాలీ నిర్వహణపై ఉద్ధవ్‌ శివసేన వర్గానికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, 1966 నుంచి ఏటా దసరా రోజున శివసేన ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తోంది. కరోనా కారణంగా 2020, 21లో ఈ కార్యక్రమం నిర్వహించలేదు. ప్రస్తుతం శివసేన రెండు వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో.. ఈ దసరా ర్యాలీ నిర్వహణ కీలకంగా మారింది.

కోర్టు తీర్పు అనంతరం ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. తాము ర్యాలీకి అనుమతి పొందామని.. శాంతిభద్రతలను నిర్వహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై ఉందన్నారు. కానీ తాము కూడా తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. సందడి వాతావరణంలో వేడుక చేసుకొని.. సంప్రదాయాన్ని కొనసాగిద్దామంటూ పేర్కొన్నారు. కోర్టుకు వెళ్లడంపై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా పోరాటం చేశామని.. వారికి ప్రతిష్ట కోసం పోరాటం చేశారంటూ షిండే వర్గంపై మండిపడ్డారు. చివరికి ప్రజాస్వామ్యం గెలిచిందంటూ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి