CM Stalin: తమిళనాడుపై కత్తి వేలాడుతోంది.. వెంటనే పిల్లల్ని కనండి! తమిళ ప్రజలకు సీఎం స్టాలిన్‌ పిలుపు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేంద్రం చేపడుతున్న లోక్‌సభ స్థానాల పునర్విభజన వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే తమిళనాడుకు సీట్లు తగ్గే ప్రమాదం ఉందని, దీన్ని నివారించేందుకు కొత్తగా వివాహం చేసుకున్న వారు వెంటనే పిల్లలను కనాలని కోరారు. ఈ డీలిమిటేషన్‌పై చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

CM Stalin: తమిళనాడుపై కత్తి వేలాడుతోంది.. వెంటనే పిల్లల్ని కనండి! తమిళ ప్రజలకు సీఎం స్టాలిన్‌ పిలుపు
Mk Stalin

Updated on: Mar 03, 2025 | 2:05 PM

కొత్తగా పెళ్లైన వాళ్లు వెంటనే పిల్లల్ని కనాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. తమిళనాడుపై కత్తి వేలాడుతోందని, పిల్లల్ని ఎక్కువగా కనకపోతే రాష్ట్రం రాజకీయంగా తీవ్రంగా నష్టపోతుందని కూడా స్టాలిన్‌ తమిళ ప్రజలను హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్థానాల పునర్విభజన చేపడుతున్న నేపథ్యంలో స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రతిపదికన లోక్‌ సభ నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ లోక్‌ సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ వల్ల తమిళనాడుకు లోక్‌ సభ సీట్లు తగ్గుతాయని, దాంతో రాజకీయంగా తమిళనాడు ప్రాధాన్యత కోల్పోతుందని సీఎం స్టాలిన్‌ అన్నారు.

గతంలో తాము జనాభా నియంత్రణ కోసం ఎంతో కృషి చేశామని, ఇప్పుడు అదే తమకు ముప్పులా మారే అవకాశం ఉందని అన్నారు. ఇప్పడు కేంద్ర ప్రభుత్వ జనాభా సంఖ్య ఆధారంగా లోక్‌ సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లోక్‌ సభ సీట్ల సంఖ్య పెరిగి, బీజేపీయేతర పార్టీ, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ ఇచ్చిన పిలుపు చర్చనీయాంశంగా మారింది.

ఈ డీలిమిటేషన్‌పై చర్చించేందుకు మార్చ్‌ 5న అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని స్టాలిన్‌ వెల్లడించారు. ఇది ఎవరి వ్యక్తిగత సమస్య కాదని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సమస్య అని అన్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి ఎన్నికల కమిషన్‌ వద్ద నమోదైన 40 రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు. అహం పక్కనపెట్టి ఈ సమస్యపై అంతా కలిసి రావాలని కూడా పిలుపునిచ్చారు. అఖిలపక్ష నిర్వహించిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకొని, ఈ లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ముందుకు వెళ్తామని స్టాలిన్‌ వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.