
తమిళనాడులోని సేలం ప్రభుత్వ మోహన్ కుమారమంగళం వైద్య కళాశాల ఆసుపత్రిలో పాము కలకలం రేపింది. ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌లోని మూడో అంతస్తులోకి పాము ప్రవేశించడంతో రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాము ఇంకా పట్టుబడకపోవడంతో ఆసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రతిరోజూ రెండు వేల మందికి పైగా ఔట్‌పేషెంట్లకు, వెయ్యికి పైగా ఇన్‌పేషెంట్లకు వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాలు పనిచేస్తున్నాయి. ఈరోజు న్యూరాలజీ విభాగంలోని ఉమ్మడి హాలులోకి పాము అకస్మాత్తుగా రావడంతో అక్కడ ఉన్న వైద్య కళాశాల విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. వెంటనే విద్యార్థులను మరో గదికి సురక్షితంగా తరలించారు.
సమాచారం అందుకున్న సెవ్వాపేట అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెంటనే ఆసుపత్రికి చేరుకుని పాము కోసం గాలింపు చేపట్టారు. అయితే పాము మూడో అంతస్తులోని ఓ చిన్న రంధ్రం గుండా తప్పించుకోవడంతో దానిని వెంటనే పట్టుకోలేకపోయారు. అనంతరం ఆ రంధ్రాన్ని అగ్నిమాపక సిబ్బంది మూసివేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో వాటిని వేటాడేందుకు పాము లోపలికి ప్రవేశించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ పాము ఇంకా చిక్కకపోవడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు, వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. పామును గుర్తించి సురక్షితంగా పట్టుకునేందుకు అగ్నిమాపక సిబ్బంది, ఆసుపత్రి యాజమాన్యం సంయుక్తంగా చర్యలు కొనసాగిస్తున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..