
కలెక్టర్ వాహనం ఢీకొని రైతు మృతి చెందిన ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది . వివరాల్లోకి వెళ్తే.. ఈరోడ్ జిల్లా మేజిస్ట్రేట్ అయిన కందస్వామి, గురువారం తన అధికారిక వాహనంలో గోపిచెట్టిపాలయం వైపు వెళ్తున్నాడు.. ఈ క్రమంలో వెల్లాంగ్ కోయిల్ ప్రాంతానికి చెందిన షణ్ముగం అనే రైతు కూడా స్కూటీపై అదే రూట్‌లో వచ్చాడు. అయితే ప్రమాదవశాత్తు కలెక్టర్ వాహనం రైతు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైతు షణ్ముగానికి తీవ్ర గాయాలు కాగా.. కలెక్టర్ వాహన డ్రైవర్ అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు.
ఇంతలో సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే రైతును హాస్పిటల్‌కు తరలించారు. అయితే షణ్ముగాన్ని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో, షణ్ముగం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై రైతు బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే షణ్ముగం డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అంతకుముందు, కలెక్టర్ ప్రమాద స్థలం నుంచి మరో కారులో ఈరోడ్‌కు బయలుదేరారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంతో రైతు బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.