తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్.. విజయ్‌కు మద్దతు ప్రకటించిన సీపీఎం, కాంగ్రెస్..!

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళనాడు వెట్రి కళగం (TVK) ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ మద్దతు తెలపడంతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైంది.

తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్.. విజయ్‌కు మద్దతు ప్రకటించిన సీపీఎం, కాంగ్రెస్..!
Tvk Vijay

Updated on: May 08, 2026 | 4:26 PM

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళనాడు వెట్రి కళగం (TVK) ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ మద్దతు తెలపడంతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైంది.

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీపీఐ(ఎం) వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయ్ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ అధికారికంగా ఆమోదించాల్సి ఉంది. సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలకు కలిపి మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వీరంతా టీవీకేకు మద్దతు తెలపడం విజయ్ బలాన్ని పెంచింది. తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ మార్కును అందుకోవడానికి ఈ మద్దతు ఎంతో కీలకంగా మారింది.

* టీవీకే (TVK): 108 సీట్లు (విజయ్ స్వయంగా రెండు స్థానాల్లో విజయం సాధించారు).

* కాంగ్రెస్: 05 సీట్లు.

* సీపీఐ, సీపీఎం, వీసీకే: 06 సీట్లు.

* మొత్తం బలం: 118 (ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్).

మరోవైపు, భారతీయ జనతా పార్టీ (BJP) ఈ రాజకీయ చదరంగంలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. తాము ఏ పార్టీకి ఓటు వేయమని, ప్రభుత్వ ఏర్పాటులో ప్రత్యక్షంగా పాల్గొనే ఉద్దేశ్యం లేదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ జారీ చేసిన ఈ ప్రకటనలో, తమిళనాడు ప్రజల సంక్షేమం, ప్రగతికి అంకితమైన బీజేపీ, అదే లక్ష్యంతో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిందని, అయితే ఎన్నికల ఫలితాలను పార్టీ మనస్ఫూర్తిగా అంగీకరిస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు, తమకు మద్దతు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ ఇప్పటికే గవర్నర్‌ను కోరారు. అయితే, తొలుత సంఖ్యా బలం సరిపోలేదని గవర్నర్ నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు లేఖలతో విజయ్ బలం 119 కి చేరుకోవడంతో గవర్నర్ నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది.

ఈ పరిణామాల మధ్య డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు రెండు పార్టీలు తమ ప్రతినిధులను చెన్నైలోని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ.. ఈ వారంలో గవర్నర్‌తో విజయ్ మూడవసారి సమావేశం అవుతున్నారు. తమిళనాడు వెట్రి కజగం నాయకత్వంలో తమిళనాడులో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి. రాజాను కోరారు. టీవీకే నాయకుడు నిర్మల్ కుమార్ చెన్నైలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్‌ను కలిసి, ప్రభుత్వ ఏర్పాటులో సీపీఐ మద్దతు కోరారు.

అటు నేడు సాయంత్రం టీవీకే, దాని మద్దతు పార్టీలు సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించనున్నాయి. ఈ సమావేశంలో విజయ్ తన తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి తమిళనాడులో ‘దళపతి’ రాజకీయ ప్రస్థానం ఒక కొత్త శకానికి నాంది పలకబోతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us