
భారతదేశంలో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో కేవలం 17 రోజుల వ్యవధిలోనే 1,268 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 2,612కి చేరింది. ఈ పెరుగుదల జాతీయ రాజధానికే పరిమితం కాలేదు.. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్‌లలో కూడా కేసులు పెరిగాయి. మహారాష్ట్ర (1,109 కేసులు), కర్ణాటక (4,212 కేసులు), ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి పెరిగింది. ICMR ప్రకారం ఇది కొత్త రకం వైరస్ కాదని, సాధారణ సీజనల్ H1N1 pdm09 వైరస్ అని తెలిపారు. కేసులు పెరుగుతున్న తరుణంలో ఫ్లూ వ్యాక్సిన్ల వినియోగం దేశవ్యాప్తంగా మూడు రెట్లు పెరిగింది.
ఢిల్లీలో కేవలం 17 రోజుల వ్యవధిలోనే (ఆగస్టు 10న 1,344 కేసుల నుండి ఆగస్టు 27 నాటికి 2,612కి) 1,268 కొత్త స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఇదే సమయంలో 3,300 కంటే ఎక్కువ ఇన్ఫ్లుఎంజా-ఎ కేసులు కూడా నమోదైనట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. వర్షాకాలం, చలికాలంలో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నందున, రాబోయే రోజుల్లో కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
స్వైన్ ఫ్లూ ప్రభావం కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. ఆగస్టు 21 నాటికి మహారాష్ట్ర వ్యాప్తంగా 1,109 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబై, పూణే ప్రాంతాల నుంచే దాదాపు 65శాతం కేసులు ఉన్నాయి. అటు కర్ణాటకలోనూ ఫ్లూ ప్రభావంగా తీవ్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 4,212 ఇన్ఫ్లుఎంజా కేసులు నమోదవగా, ఒక్క బెంగళూరు లోని రెండు ప్రాంతాల నుంచే 3,081 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 364 కేసులు నమోదవ్వగా, లక్నోలో ఒక మహిళ మరణించడంతో 75 జిల్లాల ఆసుపత్రులను హై అలర్ట్ చేశారు. రాజస్థాన్, తమిళనాడు, కేరళ, గుజరాత్ లలో కూడా కేసులు పెరుగుతున్నాయి.
భారతదేశంలో సాధారణంగా వర్షాకాలం, శీతాకాలంలో ఇన్ఫ్లుయెంజా వ్యాప్తి పెరుగుతుంది. ఆగస్టులో నమోదైన కేసుల పెరుగుదల తర్వాత, నవంబర్, ఫిబ్రవరి మధ్య కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదల నేపథ్యంలో, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఫ్లూ వ్యాక్సిన్‌లకు డిమాండ్ దాదాపు మూడు రెట్లు పెరగగా, జూలై నుంచి ఇది రెండింతలకు పైగా పెరిగింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ ప్రకారం, దేశంలో వ్యాపిస్తున్న ఇన్ఫ్లుఎంజా-ఎ కేసులలో 97 నుండి 98 శాతం స్వైన్ ఫ్లూవే ఉన్నప్పటికీ, ఇది ఏదీ కొత్త స్ట్రెయిన్ కాదు. సాధారణంగా ప్రతి సంవత్సరం వచ్చే సీజనల్ H1N1 pdm09 రకమేనని, ఇవి సాధారణ చికిత్సతో నయమవుతాయని స్పష్టం చేశారు.
– అధిక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు
– తలనొప్పి, చలి, తీవ్రమైన అలసట, నీరసం
– శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ నొప్పి, వీటికి తక్షణ వైద్య సహాయం అవసరం.
జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే విశ్రాంతి తీసుకోవాలి.
గుంపులుగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, తరుచుగా చేతులు కడగడం అలవాటు చేసుకోవాలి.
పిల్లలు, వయోవృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సొంత వైద్యంతో యాంటీబయోటిక్స్ వాడకూడదు.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఫ్లూ వ్యాక్సిన్ల డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగింది.