
సమయం చాలా శక్తివంతమైనదని అంటారు. అంటే ప్రజలు తాము ఏది కావాలంటే అది చేయగలరని నమ్ముతారు. కానీ కొన్నిసార్లు, కాలం ఎంత ట్రిక్ ప్లే చేస్తుందంటే, ముందుగా అనుకున్న ప్రణాళికలన్నీ నెరవేరవు. ప్రముఖ హాస్యనటుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సమయ్ రైనా విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఇటీవలి సంవత్సరాలలో సమయ్ రైనా సోషల్ మీడియాలో అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. వికలాంగులను ఎగతాళి చేసినందుకు పరిణామాలను ఎదుర్కొంటున్నారు.
ఇండియాస్ గాట్ టాలెంట్ షో భారీ విజయాన్ని సాధించింది. అయితే, యూట్యూబర్ రణవీర్ అలహాబాద్‌డియా పాల్గొన్న ఆ షో చివరి ఎపిసోడ్‌లో దివ్యాంగులపై అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. దీని ఫలితంగా రణవీర్ అలహాబాద్‌డియా, సమయ్ రైనా సహా ఇతర హాస్యనటుపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. సమయ్ రైనా తన షో నుండి అన్ని వీడియోలను యూట్యూబ్ నుండి తొలగించాల్సి వచ్చింది.
సమయ్ రైనా ఇటీవల దివ్యాంగులను ఎగతాళి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తరువాత అతను క్షమాపణలు కూడా చెప్పాడు. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియా నుండి తొలగించాలని సుప్రీంకోర్టు రైనాను ఆదేశించింది. ఇప్పుడు, ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు సమయ్ రైనాకు వింత శిక్ష విధించింది. వికలాంగుల కోసం నిధుల సేకరణ కార్యక్రమాలను నెలకు కనీసం రెండుసార్లు నిర్వహించాలని ఆదేశించింది. తద్వారా వచ్చే ఆదాయాన్ని వికలాంగులకు, వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి చికిత్స చేయడానికి ఉపయోగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సమయ్ రైనా తోపాటు మరో నలుగురు హాస్యనటులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చితో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వు జారీ చేసింది. వికలాంగుల గౌరవాన్ని ఉల్లంఘించే ఆన్‌లైన్ కంటెంట్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ క్యూర్ SMA ఇండియా ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. సమయ్ రైనా సహా ఇతర హాస్యనటులు విపుల్ గోయల్, బలరాజ్ పరంజిత్ సింగ్ ఘాయ్, సోనాలి ఠక్కర్ (సోనాలి ఆదిత్య దేశాయ్), నిశాంత్ జగదీష్ తన్వర్ – కోర్టు ముందస్తు ఆదేశాలను పాటిస్తూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి ముందుకు వచ్చారని ధర్మాసనం పేర్కొంది. వారి ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా వికలాంగుల విజయగాథలను వివరించడానికి వారు అనుమతి కోరారు. వికలాంగులను వారి ప్రత్యేక ప్రదర్శనలలో పాల్గొనేలా ఒప్పించడం ఇప్పుడు హాస్యనటుల పని అని సుప్రీం కోర్టు పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..