Spice Jet: స్పైస్‌జెట్ సంస్థకు చెందిన విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మంగళవారం రాత్రి సైబర్ నేరగాళ్లు విమానయాన సంస్థకు చెందిన సిస్టమ్స్ పై రాన్సమ్‌వేర్ దాడి చేయటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ కారణంగా ఉదయం బయులుదేరాల్సిన అనేక విమానాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో వందల మంది ప్రయాణికులు అనేక విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. సైబర్ దాడి కారణంగా సేవలు ఆలస్యమయ్యాయని కంపెనీ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. కంపెనీకి చెందిన ఐటీ సిబ్బంది సమస్యను పరిష్కరించారని.. ప్రస్తుతం విమానాలు సాధారణంగా నడుస్తున్నాయని సంస్థ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో వెల్లడించింది. విమానాలు నిలిచిపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొన్న అనేకమంది ప్రయాణికులు వరుస ట్వీట్లు చేసిన వేళ కంపెనీ ఇలా స్పందించింది. విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు ఆలస్యంతో తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. గ్రౌండ్ స్టాఫ్ “సర్వర్ డౌన్ అయింది” అని వారికి తెలియజేశారు. అయితే గంటల పాటు వేచిఉన్న తమకు కనీసం బ్రేక్ ఫాస్ట్ కూడా సంస్థ ఏర్పాటు చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
#ImportantUpdate: Certain SpiceJet systems faced an attempted ransomware attack last night that impacted and slowed down morning flight departures today. Our IT team has contained and rectified the situation and flights are operating normally now.
— SpiceJet (@flyspicejet) May 25, 2022
Sophos ఇటీవలి నివేదిక ప్రకారం.. 2021లో 78 శాతం భారతీయ సంస్థలు సైబర్ దాడుల బారిన పడ్డాయి. 2020లో ఇవి 68 శాతంగా ఉన్నాయి. అత్యంత తీవ్రమైన సైబర్ దాడిలో డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడిన భారతీయ సంస్థ అత్యధికంగా 1,198,475 డాలర్లను చెల్లించాయి. నివేదిక ప్రకారం 10 శాతం బాధితులు సగటున ఒక మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తమ డేటాను విడిపించుకోవటానికి చెల్లించాయని తేలింది.
ప్రయాణీకుల్లో ఒకరైన సౌరవ్ గోయల్ ట్వీట్ చేస్తూ.. “ఫ్లైస్పైస్‌జెట్ కస్టమర్ సర్వీస్ చాలా పేలవంగా ఉంది. ఢిల్లీ నుంచి ఉదయం 6.25 గంటలకు శ్రీనగర్ SG 473కి వెళ్లాల్సిన నా విమానం ఇప్పటికీ విమానాశ్రయంలోనే ఉంది. సిబ్బందికి ఎలాంటి క్లూ లేదు. ‘సర్వర్ డౌన్’ కాబట్టి ప్రింటవుట్ తీసుకోలేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు” అని వెల్లడించారు. ఇలా అనేక మంది ప్రయాణికులు ఎంత సేపటికి తమ విమానాలు టేకాఫ్ అవుతాయో తెలియక వేచి ఉన్నామంటూ తమ ఇబ్బందిని సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తున్నారు.