
ఒకవైపు కన్నుమూసిన తండ్రి.. మరోవైపు చివరిసారిగా ఆయనను చూసేందుకు కూడా వెళ్లలేని నిస్సహాయ పరిస్థితి. విమానయాన సంస్థ నిర్లక్ష్యమో, నిర్వహణ లోపమో ఓ కుమారుడికి తీరని విషాదాన్ని మిగిల్చింది. తండ్రి అంత్యక్రియలకు సమయానికి చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడు ఢిల్లీ విమానాశ్రయంలో కన్నీరుమున్నీరుగా విలపించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పైస్‌జెట్ విమానం పదేపదే ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి ఎదురైంది.
ఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు తన తండ్రి మరణవార్త తెలుసుకుని స్వస్థలానికి బయలుదేరాడు. అయితే విమానం ఆలస్యం కావడంతో తండ్రి అంత్యక్రియలకు సమయానికి చేరుకోలేకపోయాడు. విమానాశ్రయంలో ఉన్న సిబ్బందిని తనను వెళ్లనివ్వాలంటూ కన్నీళ్లతో వేడుకున్నాడు. “మా నాన్న చనిపోయారు.. నేను మా నాన్న దగ్గరకు వెళ్లాలి” అంటూ పదేపదే అభ్యర్థించాడు. అతడి ఆవేదన అక్కడున్న వారిని కలచివేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) అధ్యక్షుడు యశ్ దబాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో ప్రయాణికుడి బాధ స్పష్టంగా కనిపిస్తోంది. విమానయాన సంస్థ సిబ్బంది తీరుపై యశ్ దబాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కుమారుడు తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేని పరిస్థితి రావడం బాధాకరమని విమర్శించారు.
అయితే, మధ్యాహ్నం 1:50 గంటలకు బయలుదేరాల్సిన పాట్నా విమానాన్ని సాయంత్రం 6:30 గంటలకు వాయిదా వేశారు. అంటే దాదాపు నాలుగున్నర గంటల ఆలస్యం. మరోవైపు బోర్డింగ్ ప్రారంభం కాకపోయినా డిస్‌ప్లే స్క్రీన్‌పై బోర్డింగ్ గేట్ మూసివేసినట్లు చూపించడం కూడా వివాదానికి కారణమైంది.
ఈ జాప్యంతో విసిగిపోయిన ఇతర ప్రయాణికులు సైతం విమానాశ్రయంలో నిరసనకు దిగారు. స్పైస్‌జెట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు విమానయాన సంస్థపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరు తమకు ఎదురైన విమాన ఆలస్యాలు, రద్దులు, రీఫండ్ సమస్యలను కూడా కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.
మొత్తానికి విమాన ఆలస్యం కేవలం ప్రయాణికుల సమయాన్ని మాత్రమే కాదు.. కొన్ని సందర్భాల్లో వారు తమ ఆత్మీయులతో గడపాల్సిన చివరి క్షణాలను కూడా దూరం చేస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. అయితే ఈ ఘటనపై స్పైస్‌జెట్ అధికారిక వివరణ ఏమిటన్నది తెలియాల్సి ఉంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..