
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తన జీవితంలోని అనుభవాలు వివరిస్తూ రచించిన ఆత్మకథ బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్ (Belonging: A Journey of Love) పుస్తకాన్ని సోమవారం న్యూఢిల్లీలో అధికారికంగా ఆవిష్కరించారు. బయట తన కుటుంబం గురించి ఎన్నో అవాస్తవ కథనాలు ప్రచారంలో ఉన్నాయని, వాటికి వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రాసినట్లు సోనియా గాంధీ వెల్లడించారు. నవంబర్ 10న మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకం ఆరు రోజుల్లోనే 2 లక్షలకు పైగా కాపీలు అమ్ముడై, అత్యంత వేగంగా అమ్ముడైన పుస్తకాల జాబితాలో ఒకటిగా నిలిచింది.
అవాస్తవాలకు వాస్తవాలతో సమాధానం
ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. తన కుటుంబం గురించి, ముఖ్యంగా తన అత్త, భర్త, కుమారుడు, కుమార్తె, తన గురించి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయని.. వాటిలో చాలా వరకు అవాస్తవాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. తమ ఫ్యామిలీ చూట్టూ అనేక కల్పిత కథలు అల్లుతున్నారని, అసత్యాలను ప్రచారం చేస్తూ బాధించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన భావాలను, తన కుటుంబం గురించి తనకు తెలిసిన వాస్తవాలను పుస్తకం రూపంలో ప్రజల ముందుకు తెచ్చినట్టు తెలిపారు.
బిలాంగింగ్ పేరుకు అర్థం ఇదే..
తన పుస్తకానికి బిలాంగింగ్ అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించారు. ఒక కొత్త వ్యక్తిగా మరో సమాజంలోకి వెళ్లినప్పుడు అక్కడి వారిలా తాను లేననే భావన కలుగుతుందని.. ఎప్పుడూ ఇతరులు తమను గమనిస్తున్నారనే ఆలోచన, తాము ఏదైనా తప్పు చేస్తున్నామేమోననే సందేహం ఉంటాయని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఇతరుల అంగీకారం పొందేందుకు చేసే ప్రయత్నం, చివరకు ఆ సమాజంలో ఒకరిగా గుర్తింపు పొందడమే బిలాంగింగ్ అనే పేరుకు అర్థమని వివరించారు.
భారతీయ మహిళల జీవితాలతో పోలిక
పెళ్లి తర్వాత అల్లారింట్లోకి అడుగుపెట్టిన మహిళలు ఎదుర్కొనే పరిస్థితులతో తన అనుభవాలను పోల్చారు సోనియా గాంధీ. భారతదేశంలో ఎంతోమంది అమ్మాయిలు పెళ్లి తర్వాత అత్తవారింటికి వెళ్లి అక్కడి పద్ధతులు, సంప్రదాయాలకు అనుగుణంగా మారాల్సి వస్తుందని.. తన విషయంలో ఇది మరింత కష్టంగా అనిపించిందన్నారు. ఎందుకంటే తాను పూర్తిగా భిన్నమైన సామాజిక, సాంస్కృతిక వాతావరణం నుంచి వచ్చానని తెలిపారు. అయితే భారతీయ అమ్మాయిలకు కూడా ఇది అంత సులభం కాదని.. కొత్త ఫ్యామిలీలో వారు అందరికీ నచ్చాలి అంటే ఎంతో కష్టపడాలన్నారు. అందుకే తన పుస్తకానికి బిలాంగింగ్ అనే పేరు పెట్టినట్లు వివరించారు.
పాఠకుల ఆదరణపై స్పందన
తన పుస్తకానికి పాఠకుల నుంచి లభిస్తున్న ఆదరణపై సోనియా గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు తనను భావోద్వేగానికి గురిచేశాయని తెలిపారు. పుస్తకంపై వచ్చిన విమర్శల్లో కొన్ని చాలా కఠినంగా ఉన్నాయని, మరికొన్ని మాత్రం నిజాయితీతో కూడుకున్నవని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా
ఈ సందర్భంగా తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో పరిచయం, ప్రేమానుబంధాన్ని కూడా సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. కేంబ్రిడ్జ్లో ఒక స్నేహితుడి ద్వారా రాజీవ్ గాంధీతో తనకు పరిచయం ఏర్పడిందని తెలిపారు. తమది ఓ అద్భుతమైన ప్రేమకథ అని అభివర్ణించారు. అయితే తన తండ్రి చాలా కఠినంగా ఉండేవారని, తమ వివాహం సజావుగా సాగకపోతే తిరిగి వచ్చేందుకు వీలుగా తనకు రిటర్న్ టికెట్ కూడా ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. అయితే తాను తిరిగి వెళ్లలేదని వ్యాఖ్యానించారు.
పుస్తకావిష్కరణకు హాజరైన ప్రముఖులు
న్యూఢిల్లీలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తమిళనాడు సీఎం విజయ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.