సర్కార్ ఆస్పత్రి నిర్లక్ష్యం.. స్ట్రెచ్చర్ లాగిన ఆరేళ్ల బాలుడు

| Edited By: Pardhasaradhi Peri

Jul 21, 2020 | 6:21 PM

ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై ఇప్పటికే ప్రజల్లో అనేక అపోహలు, భయాందోళనలు వెంటాడుతున్నాయి. సర్కార్   ఆస్పత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సర్కార్ ఆస్పత్రి నిర్లక్ష్యం.. స్ట్రెచ్చర్ లాగిన ఆరేళ్ల బాలుడు
Follow us on

ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై ఇప్పటికే ప్రజల్లో అనేక అపోహలు, భయాందోళనలు వెంటాడుతున్నాయి. సర్కార్   ఆస్పత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా యూపీలో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అక్కడి సిబ్బందిపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం డియోరియా జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సాయం చేస్తూ..వారి నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే నడవలేని ఓ వ్యక్తిని ఒక వార్డు నుంచి మరో వార్డుకు తరలించాల్సి వచ్చింది. అందుకు స్ట్రెచ్చర్ అవసరం కావడంతో వార్డుబాయ్‌ సాయం కోరారు అతడి కుటుంబీకులు..స్ట్రెచ్చర్ లాగేందుకు సదరు వార్డుబాయ్ 30 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే, అందుకు వారు ప్రతిసారీ డబ్బులు ఇవ్వాలంటే, తమ వద్ద లేవని, సాయం చేయాలని కోరారు. దానికి నికారించిన వార్డు బాయ్ స్ట్రేచ్చర్‌పై ఉన్న వ్యక్తిని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో చేసేది లేక ఆ వ్యక్తి దగ్గరున్నమహిళ, ఆరేళ్ల బాలుడు స్ట్రెచ్చర్ లాగుతూ లోనికి తీసుకెళ్లారు.

డియోరియా జిల్లా బర్హాజ్ ప్రాంతంలోని గౌరా గ్రామానికి చెందిన చెడి యాదవ్ అనే వృద్ధుడికి రెండు రోజుల క్రితం ఓ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని సర్జికల్ వార్డులో చేర్పించారు. అయితే, అతడి భార్య ఆస్పత్రికి రాలేని స్థితిలో ఉండటంతో అతడి కూతురు బిందు, ఆరేళ్ల మనవడు శివం ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలోనే తన తండ్రికి డ్రెస్సింగ్ చేయాల్సి ఉండగా, వార్డుకు స్ట్రెచ్చర్ నెట్టేందుకు వార్డు బాయ్ సాయం కోరింది బిందు. అందుకు వార్డు బాయ్ ప్రతి సారి 30 రూపాయలు అడగటం మొదలు పెట్టాడు. అన్నిసార్లు అతడికి డబ్బులు ఇవ్వలేక ఆమె తన కొడుకు సాయంతో స్ట్రెచ్చర్ నెట్టుకుంటూ తండ్రిని డ్రెస్సింగ్ రూమ్‌కి తరలించింది.

ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పసివాడు స్ట్రెచ్చర్ లాగటం గమనించిన అక్కడి స్థానికులు కొందరు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విషయం తెలిసిన.. ఉన్నతాధికారులు సదరు వార్డుబాయ్‌ని విధుల నుంచి తొలగించారు. ఆస్పత్రిని సందర్శించిన జిల్లా మేజిస్ట్రేట్ అధికారులు జరిగిన విషయంపై బాధితులను ఆరా తీశారు.