Sabarimala: అక్టోబర్ 29 నుంచి శబరిమల దర్శనం బుకింగ్‌.. రోజుకు 60 వేల మందికి అవకాశం!

Sabarimala Online Booking Telugu: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు ముఖ్యమైన సమాచారం. అక్టోబర్ 29 నుంచి వర్చువల్ క్యూ బుకింగ్ ప్రారంభం కానుంది. రోజువారీ బుకింగ్ పరిమితులు, స్పాట్ బుకింగ్ కేంద్రాలు, అవసరమైన పత్రాలు, ఆన్‌లైన్‌లో దర్శన పాస్ బుక్ చేసుకునే విధానం గురించి తెలుసుకోండి.

Sabarimala: అక్టోబర్ 29 నుంచి శబరిమల దర్శనం బుకింగ్‌.. రోజుకు 60 వేల మందికి అవకాశం!
Sabarimala Virtual Queue Booking

Updated on: Oct 28, 2026 | 10:18 AM

Sabarimala Virtual Queue Booking 2026: అయ్యప్ప భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శబరిమల మండల–మకరవిళక్కు యాత్రకు సంబంధించి వర్చువల్‌ క్యూ బుకింగ్‌ తేదీ ఖరారైంది. అక్టోబర్‌ 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని నియంత్రించి, యాత్రను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందుగానే వర్చువల్‌ క్యూ పాస్‌ బుక్‌ చేసుకోవాలి.

రోజుకు 60 వేల మందికి ఆన్‌లైన్‌ బుకింగ్‌

శబరిమల దర్శనం కోసం భక్తులు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://sabarimalaonline.org/#/login ద్వారా వర్చువల్‌ క్యూ బుకింగ్‌ చేసుకోవచ్చు. ప్రధాన మార్గమైన నిలక్కల్‌–పంబ ద్వారా రోజుకు 60 వేల మంది భక్తులకు అవకాశం కల్పించారు. ఎరుమేలి అటవీ మార్గం, వండిపెరియార్‌–సత్రం మార్గాల ద్వారా రోజుకు 3 వేల మంది చొప్పున బుకింగ్‌ చేసుకోవచ్చు.

స్పాట్‌ బుకింగ్‌ కేంద్రాలు ఎక్కడంటే?

ఆన్‌లైన్‌లో ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకోలేని భక్తుల కోసం కొన్ని ప్రాంతాల్లో స్పాట్‌ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నిలక్కల్‌లో రోజుకు 10 వేల మందికి, ఎరుమేలిలో 2 వేల మందికి, వండిపెరియార్‌ సత్రంలో మరో 2 వేల మందికి బుకింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు పంబలో స్పాట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని తొలగించారు. కాబట్టి భక్తులు యాత్రకు ముందుగానే తమ దర్శన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.

వర్చువల్‌ క్యూ బుకింగ్‌ పూర్తిగా ఉచితం

శబరిమల వర్చువల్‌ క్యూ బుకింగ్‌ కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. భక్తులు కోరుకుంటే పిలిగ్రిమ్‌ రిలీఫ్‌ ఫండ్‌, జనరల్‌ ఫండ్‌కు కనీసం రూ.5 నుంచి స్వచ్ఛందంగా విరాళం అందించవచ్చు. ఈ మొత్తాన్ని ఆలయ నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి అవసరాలకు వినియోగిస్తారు. అయితే విరాళం ఇవ్వడం తప్పనిసరి కాదు.

బుకింగ్‌కు ముందు ఈ వివరాలు సిద్ధం చేసుకోండి

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురుకాకుండా భక్తులు కొన్ని వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పనిచేస్తున్న మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, ఆధార్‌ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు లేదా పాస్‌పోర్టు వంటి గుర్తింపు పత్రాలు అవసరం. అలాగే 30 కేబీ కంటే తక్కువ పరిమాణంలో ఉన్న పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోను సిద్ధంగా ఉంచుకోవాలి.

వర్చువల్‌ క్యూ పాస్‌ ఎలా బుక్‌ చేసుకోవాలి?

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి కొత్త వినియోగదారులు తమ పేరు, మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఓటీపీ ద్వారా ఖాతాను ధ్రువీకరించిన తర్వాత లాగిన్‌ కావాలి. అనంతరం వ్యక్తిగత వివరాలు, గుర్తింపు కార్డు నంబర్‌, ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత వర్చువల్‌ క్యూ ఆప్షన్‌ను ఎంచుకుని అందుబాటులో ఉన్న దర్శనం తేదీ, సమయం, యాత్ర మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి. వివరాలను సరిచూసి బుకింగ్‌ను ధ్రువీకరించిన తర్వాత క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పాస్‌ జనరేట్‌ అవుతుంది. దాన్ని పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకుని మొబైల్‌లో భద్రపరుచుకోవాలి.

భక్తులు బుకింగ్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌నే ఉపయోగించాలి. వర్చువల్‌ క్యూ పాస్‌ ఉచితం కాబట్టి అదనపు డబ్బులు అడిగే నకిలీ వెబ్‌సైట్లు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. యాత్రకు బయలుదేరే ముందు దర్శనం తేదీ, సమయం, మార్గం వంటి వివరాలను మరోసారి తనిఖీ చేసుకోవాలి.

శబరిమల దర్శనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Loading...
Unable to load recommendations.
Follow Us