ఏదైనా సరే అవసరం ఎక్కువ ఉంటే.. దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో మేకపాలకు ఓ రేంజ్‌లో ధర పెరిగింది. పెరిగిన ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ తింటారు. సాధారణంగా ఒక లీటరు మేక పాల ధర రూ .50 ఉంటుంది, కానీ ఇప్పుడు అదే లీటరు పాలను రూ .1500 కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ఇంత భారీగా మేక పాలు ధర పెరగడానికి కారణం ఏంటని అనుకుంటున్నారా..?. డెంగ్యూ. అవును ఉత్తరప్రదేశ్ డెంగ్యూ విజృంభించింది. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడిచారు. డెంగ్యూ ముఖ్యంగా ప్లేట్‌లెట్స్ కౌంట్‌ను తగ్గించి.. రోగులును ఇబ్బందులకు గురిచేస్తోంది. కాగా మేకపాలు సేవించడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందని ప్రచారం జరగడంతో.. అక్కడ వ్యాధిగ్రస్తులు మేకపాల కోసం క్యూ కట్టారు. దీంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
“గత నెలలో డెంగ్యూ వ్యాప్తి చెందినప్పటి నుండి ప్రజలు మేక పాలు కోసం నన్ను సంప్రదిస్తున్నారు. నేను పాలను సాధారణంగా లీటర్ రూ .50 కి విక్రయిస్తాను. డిమాండ్ పెరగడంతో ధర రూ .1500 కి పెరిగింది” అని సదర్ బాదర్ సమీపంలో నివశించే ఒక పాల విక్రేత చెప్పారు. స్థానిక ఆయుర్వేద వైద్యులు మేకపాల ద్వారా ప్లేట్‌లెట్లు పెరుగుతాయని చెప్పడంతో రోగులు ఓ రేంజ్‌లో ఎగబడ్డారు. అయితే, మేక పాలు ప్లేట్‌లెట్ కౌంట్ పెంచడంలో లేదా డెంగ్యూ చికిత్సలో సహాయపడుతుంది అనడానికి ఎటువంటి శాస్త్రీయ రుజువు లేదని డాక్టర్లు చెబుతున్నారు. మేకపాలు తాగితే డెంగీ జ్వరం నయం అవుతుందని కూడా ఎక్కడా వైద్యపరంగా నిరూపణ కాలేదంటున్నారు.
Also Read: రంగంలోకి నేరుగా డీజీపీ.. 70 టీమ్స్ ఏర్పాటు.. తెలివిగా తప్పించుకుంటున్న నిందితుడు