మన దేశంలో అతి పెద్ద నోటు రూ.2000ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత ప్రజలు ఈ నోటు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే.. ఈ నోట్ల చెలామణీ సెప్టెంబర్ 30 వరకూ ఉంటుందని.. అప్పటి వరకూ బ్యాంక్ లో రెండు వేల నోట్లను మార్చుకోవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) స్పష్టం చేసింది. అయినప్పటికీ చాలామంది రెండు వేలనోటుని తీసుకోవడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో జరిగిన ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం 2000 రూపాయల నోటుకు సంబంధించినది.
వాస్తవానికి.. ఓ కస్టమర్ పెట్రోల్ పంప్ వద్ద స్కూటీలో రూ.200 విలువైన పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం పెట్రోల్ పంప్ వద్ద ఉన్న సిబ్బందికి డబ్బులను చెల్లిస్తూ.. రూ.200లకు గాను రూ.2000 నోటు ఇచ్చాడు. అయితే, దానిని తీసుకునేందుకు పెట్రోల్ పంపు సిబ్బంది నిరాకరించాడు. అంతేకాదు చిల్లర లేదు.. రూ. 200 ఇవ్వండి అంటూ అడిగాడు. అప్పుడు స్కూటీ కస్టమర్ తన వద్ద ఈ నోటు మాత్రమే ఉందని చెప్పాడు. ఈ విషయమై ఇరువురి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు పెట్రోల్ పొసే వ్యక్తి.. స్కూటీ ట్యాంక్‌లో పైపు పెట్టి తాను పోసిన పెట్రోల్‌ను వెనక్కి తీసుకున్నాడు.
ఈ ఘటన జలౌన్‌లోని కొత్వాలి ప్రాంతంలోని అంబేద్కర్ కూడలిలో చోటు చేసుకుంది. సెప్టెంబరు 30లోగా రూ. 2వేల నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చని ఆ యువకుడు పెట్రోల్ బంక్ వద్ద పనిచేస్తున్న సిబ్బందికి పదేపదే చెప్పాడు. అయినప్పటికీ ఆ ఉద్యోగి తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నోటుని తీసుకోనని చెప్పాడు. చివరికి తాను పోసిన పెట్రోల్ ను తీసుకున్నాడు. దీంతో చివరికి ఆ యువకుడు పెట్రోల్ పోసుకోకుండానే తన స్కూటీని అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ మొత్తం ఘటనను అక్కడ ఉన్న మరో యువకుడు వీడియో కూడా తీశాడు.
ఈ మొత్తం విషయంపై పెట్రోల్ పంప్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. మేనేజర్ తన దగ్గర రెండు వేల రూపాయలకు తగినంత చిల్లర నోట్లు లేవని చెప్పాడు. అటువంటి పరిస్థితిలో.. తాను రెండు వందలు తీసుకుని మిగిలిన డబ్బులు ఇవ్వడం కష్టం కనుక తమ కస్టమర్ కు పెట్రోల్ ఇచ్చేందుకు నిరాకరించాల్సి వచ్చింది. అయితే, 2000 నోటును నిషేధం అనే ప్రకటన వెలువడినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రెండు వేల నోట్లను తీసుకోవడానికి పలువురు నో అంటున్నారు. పలువురు వ్యాపారస్తులు రెండు వేల రూపాయల నోటును తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. అదే సమయంలో పలు దుకాణాల వద్ద రూ. 2000 రూపాయల నోట్లకు చిల్లర లేదని తాము తీసుకోమని నోటీసు అంటించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..