యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పిక్చర్ గ్యాలరీలో హిందుత్వ సిధాంత కర్త వీర్ సావర్కర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం తలెత్తింది. దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ..ఇది ఇక్కడ ఉండాల్సింది కాదని, బీజేపీ పార్లమెంటరీ కార్యాలయంలో ఉండాల్సిందని అన్నారు. ఇక్కడినుంచి తొలగించాలని కోరుతూ చైర్మన్ రమేష్ యాదవ్ కి లేఖ రాశారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చ్చారని సింగ్ ఆ తరువాత తెలిపారు. ఈ నేపథ్యంలో దేశానికి వివిధ వ్యక్తులు చేసిన సేవలపై చర్చ జరగాలని సమాజ్ వాదీ పార్టీ కోరింది. కాగా వీర్ సావర్కర్ ను ఫ్రీడమ్ ఫైటర్ గా, దేశ భక్తునిగా సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని ఆయన నిన్న ఆవిష్కరించారు. అయితే మహాత్మా గాంధీ హంతకులతో సావర్కర్ కు లింక్ ఉందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఈ విగ్రహం తరలింపుపై కౌన్సిల్ చైర్మన్ ఓ నిర్ణయం తీసుకోవలసి ఉంది.