శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న రోబోట్ డాగ్స్.. గణతంత్ర వేడుకల్లో అసలైన హైలెట్ ఇదే..

భారత సైన్యం ఆధునిక యుద్ధ తంత్రంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళ్లు ఒక ప్రత్యేక సైనికుడిపైనే ఉండబోతున్నాయి. అదే మ్యూల్ భారత సైన్యం గర్వంగా ప్రదర్శించబోతున్న అత్యాధునిక రోబోట్ డాగ్. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించనున్న రోబోట్ డాగ్స్.. మంచు కొండల నుంచి ఎడారి ఇసుక వరకు.. శత్రువుకు చుక్కలు చూపించే రోబోట్ డాగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న రోబోట్ డాగ్స్.. గణతంత్ర వేడుకల్లో అసలైన హైలెట్ ఇదే..
Indian Army Robot Dog

Updated on: Jan 25, 2026 | 3:59 PM

నిన్నటి వరకు మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన రోబోట్ సైన్యం.. ఇప్పుడు భారత సైన్యంలో అంతర్భాగమైంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ రోబోటిక్ మ్యూల్స్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సాధారణంగా కొండ ప్రాంతాల్లో సామాగ్రిని మోసే కంచర గాడిదలను మ్యూల్స్ అంటారు. కానీ ఈ రోబోట్ మ్యూల్స్ అంతకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనవి. వీటిని భారత సైన్యం ప్రేమగా సంజయ్ అని పిలుచుకుంటోంది. ఢిల్లీకి చెందిన ఏరో-ఆర్క్ సంస్థ వీటిని అభివృద్ధి చేసింది. అమెరికాకు చెందిన విజన్ 60 రోబోట్లతో పోటీ పడగల సామర్థ్యం వీటికి ఉంది.

ప్రత్యేకతలు ఇవే

హై-రిజల్యూషన్ కెమెరాలు, థర్మల్ సెన్సార్ల సహాయంతో ఇవి 24/7 నిఘా ఉంచగలవు. మైనస్ 40 డిగ్రీల గడ్డకట్టే చలి నుంచి 55 డిగ్రీల ఎండ వరకు.. ఎలాంటి వాతావరణంలోనైనా ఇవి పని చేస్తాయి. మనుషులు వెళ్లలేని ఇరుకైన కొండ ప్రాంతాలు, అడవుల్లో ఇవి సులభంగా దూసుకుపోతాయి. వీటి వీపుపై అమర్చిన రైఫిల్స్ సెకనుకు వందలాది బుల్లెట్లను కురిపించగలవు. శత్రు డ్రోన్లను గుర్తించి, వాటిని లాక్ చేసి కూల్చివేయడంలో ఇవి మొనగాళ్లు. భూమిలో దాచిన బాంబులు, గనులు, రసాయన దాడులను ఇవి క్షణాల్లో గుర్తిస్తాయి.

శత్రువుకు నిశ్శబ్ద హెచ్చరిక

గతంలో చైనా, అమెరికా వంటి దేశాల వద్ద మాత్రమే ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు భారత్ వశమైంది. నియంత్రణ రేఖ వెంబడి ఈ రోబోట్ కుక్కలను మోహరించడం ద్వారా సైనికుల ప్రాణాలకు ముప్పు తగ్గుతుంది. ఇవి శబ్దం చేయకుండా శత్రువును వేటాడగలవు. ప్రస్తుతానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఉగ్రవాదులపై నేరుగా కాల్పులు జరపడానికి వీటికి అనుమతి లేనప్పటికీ, ఆత్మరక్షణ, నిఘాలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. త్వరలోనే వందలాది రోబోట్లతో ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలని భారత సైన్యం యోచిస్తోంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌పై వందలాది రోబోట్ కుక్కలు ఒకే లయలో కవాతు చేస్తుంటే అది భారత రక్షణ రంగం సాధించిన ప్రగతికి నిదర్శనంగా నిలవనుంది.