Indian Army: పెళ్ళైన 15 నెలల లోపే.. దేశ రక్షణ కోసం విధులను నిర్వహిస్తున్న భర్తను కోల్పోయింది. ఆ భార్య మనసు.. ఆమె అంతరంగం సంఘర్షణ మాటల్లో .. మనం చెప్పలేం ..అసలు ఊహించలేం.. అయితే ఆమె తన భర్త కోరికను తీర్చాలనుకుంది. అందుకనే భర్త కోరిక మేరకు భర్త లేకున్నా.. అతని జ్ఞాపకాలనే ఊపిరిగా మార్చుకుని.. పట్టుదలతో తన భర్త ఆశయాన్ని.. కోరికను నిజం చేస్తూ.. నేడు భారత సైన్యంలో చేరింది.. లెఫ్నెంట్ హోదాలో ఎంపిక అయ్యింది. ఆ వీరనారి ఎవరో తెలుసా.. గాల్వాన్ లోయలో(Galwan Valley) చైనా సైనికులతో(China Army) వీరోచితంగా పోరాడి అమరుడైన లాల్స్ నాయక్ దీపక్ సింగ్ (Lance Naik Shahid Deepak Singh) భార్య రేఖా సింగ్.. వివరాల్లోకి వెళ్తే…
మధ్యప్రదేశ్‌లో రీవ్ జిల్లాకి సంబంధించిన వ్యక్తి దీపక్ సింగ్. జూన్ 2020లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)తో జరిగిన ఘర్షణలో దీపక్ సింగ్ అమరుడయ్యాడు. అయితే.. దీపక్ సింగ్ తన భార్య రేఖా సింగ్‌ను ఎలాగైనా సైన్యంలో ఓ అధికారిణిని చేయాలని దీపక్ సింగ్ కలలు కనేవారు. దీంతో దీపక్ సింగ్ భార్య రేఖా సింగ్ తన భర్త ఆశయాన్ని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆర్మీలో చేరాలని భావించారు. దీంతో లాన్స్ నాయక్ వీర చక్ర అవార్డు గ్రహీత షాహిద్ దీపక్ సింగ్ భార్య రేఖా సింగ్ భారత ఆర్మీలో లెఫ్టినెంట్ హోదా లో ఎంపికయ్యారు. త్వరలో ఆమె తన శిక్షణను ప్రారంభించనున్నారు.
తన భర్త కలలే ఆమెను భారత సైన్యంలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించేలా చేసింది. రేఖా సింగ్ బీహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌కు చెందిన నాయక్ దీపక్ సింగ్‌ను వివాహం చేసుకుంది. 2020 జూన్ 15న గాల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడుతున్న సమయంలో దీపక్ సింగ్ మరణించాడు. అతని ధైర్యసాహసాలకు, దీపక్ సింగ్‌కు మరణానంతరం రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీర చక్ర అవార్డును ప్రదానం చేశారు.
రేఖ , దీపక్ ల వివాహమై కేవలం 15 నెలలు అయింది. అయితే దేశ రక్షణలో తన భర్త ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినప్పటికీ రేఖకు దేశం పట్ల ఉన్న దేశభక్తి ఆమెను ఆర్మీలో చేరేలా చేసింది.
ఇదే విషయంపై రేఖా సింగ్ స్పందిస్తూ.. “తన భర్త బలిదానం.. తన భర్తకు ఉన్న దేశభక్తి కారణంగా తాను ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
రేఖా సింగ్ ఆర్మీ అధికారులను సంప్రదించి.. తగిన మార్గనిర్దేశనం పొందారు. సైనిక అధికారుల మార్గనిర్దేశనంతో ఆమె నోయిడా వెళ్లి, సైనిక ప్రవేశ పరీక్ష రాశారు. ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ తొలి ప్రయత్నంలో విజయం సాధించలేదు.. కానీ, ధైర్యం కోల్పోకుండా రెండో సారి పరీక్ష రాసి, ఉత్తీర్ణత సాధించారు. రెండో ప్రయత్నంలో పడిన కష్టానికి ఫలితం దక్కడంతో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాకు ఎంపికయ్యారు. మే 28 నుంచి ఆర్మీ శిక్షణ ప్రారంభం కానుంది.. ఈ శిక్షణ చైన్నైలో వుంటుందని రేఖా సింగ్ తెలిపారు. ఇప్పటికే తాను శిక్షణ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఈ శిక్షణ పూర్తై న తర్వాత భర్త అడుగు జాడల్లో భారత సైన్యంలో చేరి, దేశానికి సేవలందించనున్నారు. ఇలాంటి ఎందరో త్యాగాల ఫలితంగా.. దేశంలో ఉన్న 140 కోట్లమంది సుఖంగా గుండె మీద చేయి వేసుకొని నిద్రపోతున్నామని చెప్పవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..