విపత్కర సమయంలో దేశ సేవకు అంకితం.. రైల్వే ఉద్యోగులకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు

|

Apr 03, 2021 | 6:13 PM

కోవిడ్ 19 మహమ్మారి సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ పని చేసిన రైల్వే ఉద్యోగులను పీయూష్ గోయల్ అభినందనలతో ముంచెత్తారు.

విపత్కర సమయంలో దేశ సేవకు అంకితం.. రైల్వే ఉద్యోగులకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు
Raiway Minister Piyush Goel
Follow us on

piyush goyal praises railway employees: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రైల్వే సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ పని చేసిన రైల్వే ఉద్యోగులను పీయూష్ గోయల్ అభినందనలతో ముంచెత్తారు. మునుపెన్నడూ లేనంత ఇబ్బందికర పరిస్థితులను తట్టుకుని గత ఏడాది పని చేశారని మెచ్చుకున్నారు.

రైల్వే ఉద్యోగుల సేవలను గుర్తించిన మంత్రి పీయూష్ గోయల్ దాదాపు 13 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు శనివారం ఓ లేఖ రాశారు. ఆత్మీయులను కోల్పోవడం ఎన్నటికీ మరపురాని దుఃఖమని పేర్కొన్నారు. రైల్వే కుటుంబం కోవిడ్ 19 మహమ్మారి సమయంలో లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, దృఢ నిశ్చయం ప్రదర్శించిందని, విజయం సాధించిందని ప్రశంసించారు. ఈ విపత్తు సమయంలో రైల్వే కుటుంబం దేశ సేవ కోసం అంకితమైందని చెప్పారు. ప్రపంచం స్తంభించిపోయినప్పటికీ, రైల్వే ఉద్యోగులు ఎన్నడూ డే ఆఫ్ తీసుకోలేదన్నారు. వ్యక్తిగత ప్రమాద భయం తీవ్రంగా ఉన్నప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లడం కోసం మరింత ఎక్కువగా శ్రమించారని పేర్కొన్నారు.


రైల్వే కుటుంబమంతా చిత్తశుద్ధి, అంకితభావంతో పని చేయడం వల్ల అత్యవసర వస్తువుల రవాణాకు అంతరాయం కలగలేదని పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి కేంద్రాలకు బొగ్గు రవాణా, రైతులకు ఎరువులు, వినియోగదారులకు ఆహార ధాన్యాలు వంటివాటిని ఎటువంటి అంతరాయం కలగకుండా రవాణా చేసినందుకు అభినందినట్లు పేర్కొన్నారు. రైల్వే ఉద్యోగుల దృఢ నిశ్చయం, పట్టుదల వల్ల ఓ సంక్షోభం సత్ఫలితాలు సాధించగలిగే అవకాశంగా మారిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి రైల్వేలు అసాధారణ పాత్ర పోషించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అంకితభావంతో, అద్భుతమైన కృషి చేసిన రైల్వే ఉద్యోగులకు ధన్యవాదాలు అంటూ ఎంప్లాయిస్‌కు రాసిన లేఖలో వెల్లడించారు.

Also Read…  ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు మృతి.. 12 మంది భద్రతా సిబ్బందికి గాయాలు