
పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌లో వివాహానికి సంబంధించిన మోసం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాయింట్ సెక్రటరీ, జిల్లా పరిషత్ సభ్యుడు, సిర్‌హింద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అమరీందర్ సింగ్ మండోఫల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఓ మహిళతో పాటు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళను PCS అధికారిణిగా, అవివాహితగా పరిచయం చేసి తనను పెళ్లికి ఒప్పించారని అమరీందర్ ఆరోపించారు.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మన్విందర్ కౌర్ అనే మహిళను ఆమె కుటుంబ సభ్యులు PCS అధికారిణిగా పరిచయం చేశారని, అంతేకాకుండా ఆమె అవివాహిత అని, వయస్సును కూడా తక్కువగా చూపించారని అమరీందర్ పేర్కొన్నారు. ఈ వివరాలను నమ్మి 2026 ఫిబ్రవరిలో ఇద్దరికీ వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత అనుమానం రావడంతో అమరీందర్ తన స్థాయిలో వివరాలు సేకరించగా, ఆమెకు గతంలోనే వివాహం జరిగి విడాకులు తీసుకున్నట్లు, 18 ఏళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిసిందని ఆరోపించారు. వయస్సు తగ్గించి చూపించేందుకు నకిలీ పత్రాలు చూపించినట్లు ఆయన పేర్కొన్నారు. పెళ్లి తర్వాత మన్విందర్ కౌర్ ఇంటి నుంచి బంగారం, వెండి నగలు, ఇతర విలువైన వస్తువులు తీసుకుని వెళ్లిపోయిందని అమరీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ గుర్తింపు, తప్పుడు పత్రాలు, పూర్తి సమాచారం దాచిపెట్టి వివాహం జరిపించారని ఆయన ఆరోపించారు.
ఈ ఫిర్యాదుపై ఫతేగఢ్ సాహిబ్ పోలీసులు మన్విందర్ కౌర్‌తో పాటు ఆమె సోదరుడు తర్లోచన్ సింగ్, తల్లి వరీందర్‌జిత్ కౌర్, బంధువు నరీందర్ సింగ్ గోల్డీ, వదిన రూపిందర్ కౌర్, మాజీ గ్రామ సర్పంచ్ సురీందర్ సింగ్ రాణాపై మోసం, ఫోర్జరీ తదితర ఆరోపణలతో కేసు నమోదు చేశారు. నిందితులంతా తర్న్ తారన్ జిల్లాలోని సుర్‌సింగ్ గ్రామానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఇక ఈ వివాహం గతంలోనే రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు వచ్చింది. 2026 ఫిబ్రవరిలో జరిగిన వివాహ వేడుకకు పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, క్యాబినెట్ మంత్రి తరుణ్‌ప్రీత్ సింగ్ సౌండ్ సహా పలువురు AAP నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వేడుకలో నాయకులు భాంగ్రా చేస్తూ సందడి చేసిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా వివాహంపై వచ్చిన ఆరోపణలు, ఆరుగురిపై నమోదైన కేసుతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..