క్రికెట్ దిగ్గజానికి బిగ్ షాక్.. హర్భజన్ జెడ్+ భద్రత కట్.. ఆప్‌ పార్టీని వీడటమే కారణమా?1

పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ క్రికెట్ దిగ్గజం హర్భజన్ సింగ్ పార్టీ వీడి బీజేపీలో చేరారన్న వార్తల నేపథ్యంలో, పంజాబ్ ప్రభుత్వం ఆయనకు ఉన్న భద్రతను పూర్తిగా ఉపసంహరించుకుంది.

క్రికెట్ దిగ్గజానికి బిగ్ షాక్.. హర్భజన్ జెడ్+ భద్రత కట్.. ఆప్‌ పార్టీని వీడటమే కారణమా?1
Mp Harbhajan Singh, Z Security

Updated on: Apr 26, 2026 | 1:39 PM

పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ క్రికెట్ దిగ్గజం హర్భజన్ సింగ్ పార్టీ వీడి బీజేపీలో చేరారన్న వార్తల నేపథ్యంలో, పంజాబ్ ప్రభుత్వం ఆయనకు ఉన్న భద్రతను పూర్తిగా ఉపసంహరించుకుంది.

హర్భజన్ సింగ్‌కు ఇప్పటివరకు ఉన్న జెడ్-ప్లస్ (Z+) కేటగిరీ భద్రతను ఉపసంహరిస్తూ భగవంత్ మాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జలంధర్‌లోని హర్భజన్ నివాసం వద్ద కాపలాగా ఉన్న భద్రతా సిబ్బందిని ప్రభుత్వం వెనక్కి పిలిపించినట్లు హర్భజన్ సింగ్ వ్యక్తిగత సహాయకుడు (PA) మన్‌దీప్ సింగ్ ధృవీకరించారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తాను మరికొందరు ఎంపీలతో కలిసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. బీజేపీలో చేరుతున్న ఏడుగురు ఆప్ ఎంపీల జాబితాలో హర్భజన్ సింగ్ పేరు కూడా ఉండటంతో వివాదం ముదిరింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానం ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించింది. పార్టీ అగ్ర నాయకత్వం ప్రెస్ మీట్ పెట్టి ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలపై విమర్శల వర్షం కురిపించింది.

ఈ పరిణామాలతో ఆగ్రహించిన ఆప్ కార్యకర్తలు ఎంపీల నివాసాల ముట్టడికి దిగారు. హర్భజన్ సింగ్, అశోక్ మిట్టల్, రాజిందర్ గుప్తాల ఇళ్ల వద్ద భారీ నిరసనలు జరిగాయి. హర్భజన్ సింగ్ నివాసం ప్రహరీ గోడపై ఆప్ కార్యకర్తలు స్ప్రే పెయింట్‌తో ‘ద్రోహి’ అని రాసి తమ నిరసనను వ్యక్తం చేశారు. మరికొందరు ఎంపీల ఇళ్లపై కూడా దూషణాత్మక పదజాలంతో రాతలు రాశారు.

తన భద్రత ఉపసంహరణ, పార్టీ మార్పుపై వస్తున్న ఆరోపణలపై హర్భజన్ సింగ్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. పంజాబ్‌లో అధికార పార్టీ అయిన ఆప్‌కు ఇది కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రత తొలగింపు, నిరసనల నేపథ్యంలో భవిష్యత్తులో హర్భజన్ సింగ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us