
పూణే: మహారాష్ట్రలోని పూణే ఐటీ కారిడార్ అయిన హింజేవాడిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న 27 ఏళ్ల యువతి కోమల్ దహాకేను ఆమె ప్రియుడు శుభమ్ కల్బాండే దారుణంగా కొట్టి చంపాడు. హత్య చేసిన అనంతరం కూడా అక్కడి నుంచి పారిపోకుండా రాత్రంతా మృతదేహం పక్కనే కూర్చుని ఉండిపోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, కోమల్, శుభమ్‌లకు నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ప్రస్తుతం ఇద్దరూ హింజేవాడిలోని ఒకే పీజీ హాస్టల్‌లో వేర్వేరు గదుల్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల శుభమ్‌కు వేరే యువతితో సంబంధం ఉందన్న అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఆదివారం రాత్రి వీరి వివాదం తీవ్రరూపం దాల్చడంతో, శుభమ్ కోమల్‌పై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఆదివారం రాత్రి నుంచి కోమల్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన ఆమె తల్లి, విషయాన్ని పరిశీలించమని ఓ బంధువును పీజీ హాస్టల్‌కు పంపారు. సోమవారం ఉదయం అక్కడికి చేరుకుని గది తలుపు తెరిచి చూడగా కోమల్ విగతజీవిగా పడి ఉండటం, పక్కనే శుభమ్ కూర్చుని ఉండటం కనిపించింది.
సమాచారం అందుకున్న హింజేవాడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు శుభమ్ కల్బాండేను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.