
దేశ ప్రజలకు కేంద్రం షాకివ్వనుంది. రానున్న రోజుల్లో విద్యుత్ బిల్లు మరింత పెరగనుంది. విద్యుత్ టారిఫ్ విధానంలో కేంద్రం మార్పులు చేసేందుకు సిద్దమవుతోంది. విద్యుత్ కస్టమర్లపై విధిస్తున్న స్ధిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ప్రతిపాదించింది. డిస్కంలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా పరిశ్రమలు, సంపన్నులు సొంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నారు. రూఫ్‌టాప్ సోలార్, క్యాప్టివ్ పవర్ వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని వల్ల విద్యుత్ కొనుగోళ్లు తగ్గడంతో డిస్కంలకు ఆదాయం కూడా పడిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్ధిర ఛార్జీలను పెంచాలని కేంద్రం భావిస్తోంది.
అయితే ఒకేసారి కాకుండా దశలవారీగా స్ధిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ప్రతిపాదించింది. 2030 నాటికి గృహా, వ్యవసాయ వినియోగదారుల నుంచి 25 శాతం స్థిర వ్యయాలను వసూలు చేయాలని సిఫార్సు చేసింది. ఇక పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వినియోగదారుల నుంచి 100 శాతం స్ధిర ఛార్జీలను వసూలు చేయాలని సూచించింది. దీంతో రానున్న కొన్ని ఏళ్లల్లో విద్యుత్ బిల్లులో నెలవారీ స్థిర ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం తగ్గినా స్థిర ఛార్జీలు భవిష్యత్తులో చెల్లించాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం డిస్కంలకు ఆదాయం విద్యుత్ ఛార్జీల నుంచే వస్తోంది. డిస్కంల ఆదాయంలో స్థిర ఛార్జీల భాగం తక్కువగా ఉంది. దీంతో విద్యుత్ వినియోగం తగ్గినప్పుడు ఆదాయం కూడా తగ్గుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థిర ఛార్జీలను సవరించాలని విద్యుత్ అధారిటీ సూచించింది.
విద్యుత్ కంపెనీలకు వచ్చే ఆదాయం ఉద్యోగులు జీతాలు, నెట్ వర్క్ నిర్వహణ, విద్యుత్ ఉత్పాదక సంస్థలకు చెల్లింపులకు సరిపోతుంది. ఇటీవల రూఫ్‌టాప్ సోలార్ సిస్టంల సంఖ్య పెరుగుతోంది. సొంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటున్న కంపెనీలు గ్రిడ్ నుంచి కొనుగోళ్లను తగ్గించాయి. అవసరమైనప్పుడు మాత్రమే విద్యుత్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ కారణంతో విద్యుత్ సంస్థలకు ఆదాయం తగ్గుతుంది. ఈ క్రమంలో రూఫ్ టాప్ సోలార్, నెట్ మీటరింగ్ వినియోగదారుల కోసం ప్రత్యేక టారిఫ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం విద్యుత్ సంస్థ సిఫార్సు చేసింది. గ్రిడ్‌ను ఉపయోగించే వినియోగదారులు దాని నిర్వహణ ఖర్చులకు కూడా సహకరించేలా కొత్త రూల్ తీసుకురానున్నారు. ఈ చర్య విద్యుత్ కంపెనీలపై భారం తగ్గిస్తుంది.