Vande Bharat Express: తెలుగు ప్రజలకు కేంద్రప్రభుత్వం సంక్రాంతి కానుకను అందజేయనుంది. జనవరి 15వ తేదీన సికింద్రాబాద్ – విశాఖపట్టణం మధ్‌య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నాను. షెడ్యూల్ ప్రకారం జనవరి 19వ తేదీన కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ పండగ సమయంలో తెలుగు ప్రజలకు కానుకను ఇచ్చేందుకు నాలుగురోజులు ముందే ఈ రైలును ప్రారంభించనున్నారు. 15వ తేదీ ఉదయం 10 గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభిస్తారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని 8వ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా దాదాపు 8 గంటల్లో విశాఖపట్టణం చేరుకోనుంది. ఈ రైలు ప్రారంభంతో విశాఖపట్టణం, సింకింద్రాబాద్ మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది.
దీంతో సంక్రాంతి నుంచి సింకింద్రాబాద్, విశాఖపట్టణం మధ్య హైస్పీడ్ ట్రైన్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఇక ఇదే తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ ట్రైన్. ఈ రైలు గంటకు 180కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఉన్న 699 కిలోమీటర్లను 8.40 గంటల్లో కవర్ చేస్తుందని రైల్వేశాఖ ప్రాధమికంగా అంచనా వేస్తోంది. దీని బట్టి చూస్తే ఇప్పటిదాకా పై రెండు నగరాల మధ్య అత్యంత వేగంగా పరుగులు పెట్టే దురుంతో కంటే గంటన్నర వ్యవధి ముందే ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుకుంటుంది. అలాగే ఇతర రైళ్లతో పోలిస్తే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుంది. గరీబ్‌రధ్ ఎక్స్‌ప్రెస్ 11.10 గంటలు, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 11.25 గంటలు, గోదావరి ఎక్స్‌ప్రెస్ 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్ 12.40 గంటలు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 12.45 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుతాయి.
మరోవైపు ఈ ట్రైన్ వారంలో అన్ని రోజులు నడవనుంది. ప్రతీ రోజూ ఉదయం విశాఖ నుంచి.. మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. 20 నిమిషాల బ్రేక్‌తో తిరిగి విశాఖకు బయల్దేరి.. రాత్రికి చేరుకుంటుంది. ఇంటర్మీడియట్ స్టేషన్లు అయిన విజయవాడలో 5 నిమిషాలు.. వరంగల్, ఖమ్మం, రాజమండ్రి స్టేషన్లలో రెండేసి నిమిషాల చొప్పున అగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..