PM Modi: ఇంధన ఆదా చర్యల్లో భాగంగా ప్రధాని కాన్వాయ్ 50 శాతానికి తగ్గింపు

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరిగిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ తన కాన్వాయ్‌ను 50 శాతం తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రోత్సాహంపై దృష్టి పెట్టిన మోదీ.. ఇంధన ఆదాలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నిర్ణయాన్ని అనుసరిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కాన్వాయ్‌లను తగ్గించే చర్యలు ప్రారంభించారు.

PM Modi: ఇంధన ఆదా చర్యల్లో భాగంగా ప్రధాని కాన్వాయ్ 50 శాతానికి తగ్గింపు
PM Modi Convoy

Edited By:

Updated on: May 13, 2026 | 10:10 AM

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో ఇంధన ఆదా చర్యలను ముమ్మరం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా తన కాన్వాయ్‌ను 50 శాతం తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇంధన ఆదా సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంగా ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధన ఆదా కోసం తన కాన్వాయ్‌ను 50 శాతం తగ్గించాలని కాన్వాయ్‌లో ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకాన్ని పెంచాలని కూడా అధికారులకు సూచించారు. ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ఆదేశాలను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) అమలు చేస్తోంది. భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడకుండా బ్లూ బుక్ రూల్స్ పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు SPG వర్గాలు స్పష్టం చేశాయి. కాన్వాయ్‌లో ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలనీ అయితే కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయవద్దని ప్రధాని ఆదేశాలు ఇచ్చారు.

ప్రధానిని ఆదర్శంగా తీసుకున్న బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు

ప్రధానిని ఆదర్శంగా తీసుకుని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు సైతం కాన్వాయ్ సంఖ్యను తగ్గించుకుంటూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగంపై దృష్టి పెట్టారు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కాన్వాయ్‌తో పాటు మంత్రులు, అధికారుల కాన్వాయ్‌లను 50 శాతం తగ్గించాలని ఆదేశించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తో సహా ఇతర బీజేపి పాలిత రాష్ట్రాలు కూడా ఇంధన ఆదా చర్యలను మొదలుపెట్టాయి. గత వారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపి బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రజలకు ఇంధన ఆదా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని, కార్ పూలింగ్, మెట్రో రైలు, ఎలక్ట్రిక్ వాహనాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడకాన్ని పెంచాలని సూచించారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలను తగ్గించాలని, బంగారం కొనుగోళ్లను కూడా ఒక సంవత్సరం వాయిదా వేయాలని ప్రజలకు మోదీ సూచించారు. ప్రధాని అభ్యర్థన పట్ల కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు చేస్తుంటే కేంద్ర మంత్రులు, బీజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రధాని మోదీ ఆదేశాలను అమలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us