PM Modi: నేల నుంచే నింగిలోని అద్భుతాల వీక్షణ.. మైసూరు Cosmos ప్లానిటోరియం ప్రత్యేకతలు ఇవే

మైసూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కాస్మోస్ ప్లానిటోరియంను శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. విద్యార్థులు, ప్రజల్లో ఖగోళ శాస్త్రంపై ఆసక్తిని పెంచి 15 మీటర్ల LED డోమ్, 42.7 మిలియన్ల పిక్సెల్స్‌తో 8K రిజల్యూషన్‌లో అంతరిక్ష అద్భుతాలను ప్రత్యక్షంగా వీక్షేంచేలా ఈ ప్లానిటోరియంను రూపొందించారు అధికారులు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ప్లానిటోరియం ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

PM Modi: నేల నుంచే నింగిలోని అద్భుతాల వీక్షణ.. మైసూరు Cosmos ప్లానిటోరియం ప్రత్యేకతలు ఇవే
Mysuru Cosmos Planetarium

Updated on: Nov 13, 2026 | 6:35 PM

ఖగోళ శాస్త్రం, అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు, ప్రజల్లో ఆసక్తిని పెంచే లక్ష్యంతో కర్ణాటకలోని మైసూరులో నూతనంగా నిర్మించిన కాస్మోస్-మైసూరు ప్లానెటేరియంను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ ప్లానిటోరియంలో 15 మీటర్ల LED డోమ్‌, 42.7 మిలియన్ల పిక్సెల్స్‌తో విజువల్ టెక్నాలజీని వాడారు. ఈ ప్లానిటోరియంలో 8K కంటే ఎక్కువ రిజల్యూషన్‌తో అంతరిక్షంలోని అద్భుతాలను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని పొందవచ్చు.

ఈ ప్లానిటోరియం ప్రత్యేకతలు ఏమిటి?

ఈ ప్లానిటోరియంలోని ప్రధానం చెప్పుకోవాల్సిన ఇందులో ఏర్పాటు చేసిన 15 మీటర్ల వంపు కలిగిన LED డోమ్‌. స్కై థియేటర్‌లో ఏర్పాటు చేసిన ఈ డోమ్‌లో ఒకేసారి సుమారు 160 మంది కూర్చుని అంతరిక్ష ప్రదర్శనలను చూడవచ్చు. సాధారణ ప్లానిటోరియంలలో చిత్రాలను ప్రదర్శన కోసం ప్రొజెక్టర్లను ఉపయోగిస్తారు. కానీ మైసూరు ప్లానిటోరియంలో డోమ్‌నే ఒక భారీ డిస్‌ప్లేగా రూపొందించారు. ఇందులో 6,148 LED ప్యానెల్స్‌, సుమారు 42.7 మిలియన్ల పిక్సెల్స్‌ ఉన్నాయి. దీంతో గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, అంతరిక్ష సంఘటనలను అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి.

ప్రత్యేక సినిమాలు, ఎగ్జిబిషన్లు

ఈ ప్లానిటోరియంలో ‘అవర్ హోమ్, అవర్ కాస్మోస్’ పేరుతో 12 నిమిషాల ప్రత్యేక చిత్రాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా ప్రదర్శించనున్నారు. ఇందులో మైసూరు సాంస్కృతిక వారసత్వం, విజ్ఞానశాస్త్రం, ఖగోళ శాస్త్రం మధ్య ఉన్న సంబంధాన్ని వివరించనున్నారు. అలాగే ‘Cosmos Odyssey’ కార్యక్రమం ద్వారా విశ్వం గురించి మానవుల అవగాహన ఎలా అభివృద్ధి చెందిందో చూపించనున్నారు. Voyager పేరుతో చారిత్రాత్మక అంతరిక్ష యాత్రల ఆధారంగా మరో కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ కాంప్లెక్స్‌లో రెండు ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్ హాళ్లు, 150 మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉన్న లెక్చర్ హాల్‌, శిక్షణ కేంద్రం, రికార్డింగ్ స్టూడియో కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌ (IIA) పరిశీలనా కేంద్రాలకు సంబంధించిన వస్తువులు, భౌగోళిక, జీవశాస్త్ర నమూనాలతో కూడిన మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. బయట జంతర్ మంతర్ స్ఫూర్తితో రూపొందించిన ఖగోళ నమూనాలు, ఇస్రో ప్రదర్శనలు, ఓపెన్ ఎయిర్ యాంఫీథియేటర్ సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.

విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు

విద్యార్థుల్లో సైన్స్‌, ఖగోళ శాస్త్రంపై ఆసక్తిని పెంచేందుకు ఈ కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా టెలిస్కోప్ ద్వారా ఆకాశ పరిశీలన, ఖగోళ విజ్ఞాన కార్యక్రమాలు, ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరాలు, సైన్స్ అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు విజ్ఞానశాస్త్రాన్ని మరింత చేరువ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ ప్లానిటోరియం ద్వారా మైసూరు సైన్స్ విద్యకు కేంద్రంగా మరింత గుర్తింపు పొందడంతో పాటు ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, పరిశోధకులు, పర్యాటకులను ఆకర్షించనుంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఉంది?

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), మైసూరు విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ ప్లానిటోరియంను అభివృద్ధి చేశాయి. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, అణుశక్తి విభాగం, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం ఈ ప్రాజెక్టుకు సహకారం అందించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు.. తన ఎంపీ ల్యాడ్స్‌ (MPLADS) నిధుల నుంచి రూ.5 కోట్లను ఈ ప్రాజెక్టుకు మంజూరు చేశారు.

అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ ప్లానిటోరియం ద్వారా అంతరిక్ష విజ్ఞానాన్ని పుస్తకాలకే పరిమితం చేయకుండా ప్రత్యక్ష అనుభూతి ద్వారా నేర్చుకునే అవకాశం విద్యార్థులకు లభించనుంది.

వీడియో చూడండి..


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us