G7 Summit 2025 Invitation: జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు భారత్‌కి ఆహ్వానం.. మోదీకి కెనడా ప్రధాని కార్నె ఫోన్ కాల్

కెనాడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్‌లో ఆ దేశ పార్లమెంట్‌లో భారత్‌పై దారుణ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నిజ్జర్‌ హత్యలో భారత్ ఏజెంట్‌ ప్రమేయం ఉన్నట్లు ఆరోపించారు. కానీ అందుకు ఎటువంటి ఆధారాలను చూపలేకపోయారు. ఇక ట్రూడో ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ వివాదం నేపథ్యంలో భారత్‌-కెనడా దౌత్యసంబంధాల దాదాపు పూర్తిగా తెగిపోయేదాకా దారితీసింది. ఈ నేపథ్యంలో తాజాగా కెనడాలో జరగనున్న 51వ G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీకి కెనడా ప్రధాని స్వయంగా ఫోన్ కాల్ చేసి ఆహ్వానం పలికడం చర్చణీయాంశంగా మారింది..

G7 Summit 2025 Invitation: జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు భారత్‌కి ఆహ్వానం.. మోదీకి కెనడా ప్రధాని కార్నె ఫోన్ కాల్
PM Modi

Updated on: Jun 07, 2025 | 5:58 PM

న్యూఢిల్లీ, జూన్‌ 6: కెనడాలో ఈ నెలలో జరగనున్న 51వ G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు మోదీ శుక్రవారం (జూన్‌ 6) ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్‌ కార్నే నుంచి కాల్ అందుకోవడం సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు. ఇటీవల జరిగిన కెనడా ఎన్నికల్లో ఆయన సాధించిన విజయాన్ని అభినందించారు. జూన్ చివర్లో కననాస్కిస్‌లో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం పంపినందుకు కార్నేకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.

శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్‌ – కెనడా ఎదుగుతున్నాయని, పరస్పర గౌరవం, ఉమ్మడి ఆసక్తుల ద్వారా మార్గనిర్దేశం చేస్తూ నూతన శక్తితో కలిసి పనిచేస్తాయని అన్నారు. శిఖరాగ్ర సమావేశంలో మా సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 15 నుండి 17 వరకు కెనడాలో జరగనున్న G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకారనే పుకార్ల  నేపథ్యంలో తాజా పరిణామం ఆసక్తికరంగా  మారింది.

హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్యతో దెబ్బతిన్న భారత్-కెనడా సంబంధాలు

2023 జూన్ 18న సాయంత్రం కెనడాలోని సర్రేలో గురుద్వారా వద్ద ఖలిస్తాన్ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను ముసుగు ధరించిన సాయుధులు కాల్చి చంపేశారు. ఈ హత్య నేపథ్యంలో భారత్ – కెనడా సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కెనాడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్‌లో ఆ దేశ పార్లమెంట్‌లో భారత్‌పై దారుణ ఆరోపణలు చేశారు. నిజ్జర్‌ హత్యలో భారత్ ఏజెంట్‌ ప్రమేయం ఉన్నట్లు ఆరోపించారు. కానీ అందుకు ఎటువంటి ఆధారాలను చూపలేకపోయారు. ఇక ట్రూడో ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ వివాదం నేపథ్యంలో భారత్‌-కెనడా దౌత్యసంబంధాల దాదాపు పూర్తిగా తెగిపోయేదాకా దారితీసింది. ఇప్పటికే రెండు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించాయి. భారత్ మాత్రం తమ దౌత్యవేత్తలను తామే వెనక్కి పిలిచామని ప్రకటించింది. అయితే ట్రూడో కంటే కార్నీ ఈ పరిస్థితిని మరింత వివేకవంతంగా హ్యాండిల్‌ చేస్తారని భారత్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

కాగా ఈ ఏడాది 51వ జీ 7 శిఖారాగ్ర సమావేశానికి కెనడా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. జీ7 దేశాల్లో భారత్‌ లేదు. అయిప్పటికీ నిర్వహణ దేశాల ఆహ్వానం మేరకు ప్రధానిమోదీ ఈ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నారు. గతేడాది ఇటలీ వేదికగా జరిగిన జీ7 సదస్సుకు కూడా భారత్‌ హాజరైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.