బెంగాల్‌కు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ

|

May 22, 2020 | 4:04 PM

పశ్చిమ బెంగాల్‌కు వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ప్రధాని మోదీ. రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఒకేసారి కరోనాతో పాటు తుపానును ఎదుర్కోవడం రాష్ట్రానికి సవాల్‌గా మారిందన్నారు.

బెంగాల్‌కు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ
Follow us on

పశ్చిమ బెంగాల్‌కు వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ప్రధాని మోదీ. రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఒకేసారి కరోనాతో పాటు తుపానును ఎదుర్కోవడం రాష్ట్రానికి సవాల్‌గా మారిందన్నారు. ఉమ్‌పున్‌ తుపానుతో భారీగా నష్టపోయిన బెంగాల్‌కు కేంద్రంతో పాటు యావత్‌ దేశం అండగా ఉందన్నారు. ఆంఫన్ తుపాను కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్న మోదీ కష్టకాలంలో బెంగాల్ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. తాత్కాలిక సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిశాక మరింత సాయం చేస్తామన్నారు.

ఉమ్‌పున్‌ తుపానుతో అతలాకుతలమైన ప్రాంతాల్లో.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి మోదీ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో..ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మ్యాప్‌ చూస్తూ అధికారులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు ప్రధాని మోదీ. అనంతరం సీఎం మమతతో పాటు అధికారులతో.. తుపాన్‌ నష్టంపై సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌ కారణంగా రాష్ట్రానికి లక్ష కోట్ల నష్టం జరిగిందని.. ప్రధాని రాష్ట్రంలో పర్యటించాలని సీఎం మమత అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన ప్రధాని..బెంగాల్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

ఉమ్‌పున్‌ తుపాను కారణంగా పశ్చిమబెంగాల్‌, ఒడిశాలో తీవ్ర విధ్వంసం జరిగింది. 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల ఎకరాల్లో పంటపొలాలు దెబ్బతిన్నాయి. పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. తీర ప్రాంతం వెంబడి అనేక చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.