భారత రాష్ట్రపతి, ప్రధాని, జడ్జీలపై నిఘా పెట్టేందుకు చైనా యత్నిస్తోందని, గూఢచర్యానికి పాల్పడుతోందని ‘సేవ్ దెమ్ ఇండియా ఫౌండేషన్’ అనే స్వఛ్చంద సంస్థ (ఎన్జీఓ) తెలిపింది. అందువల్ల చైనా చర్యలపై దర్యాప్తు జరపాలని కేంద్రాన్ని ఆదేశించాల్సిందిగా కోరుతూ ఈ సంస్థ సుప్రీంకోర్టులో ‘పిల్’దాఖలు చేసింది. సుప్రీంకోర్టు జడ్జీలపైనే కాక, హైకోర్టు న్యాయమూర్తులపైనా, ఇతర రాజకీయ ప్రముఖులపైనా చైనా నిఘా పెట్టినట్టు తమవద్ద సమాచారం ఉందని ఈ సంస్థ పేర్కొంది. సమాచార, టెక్నాలజీ చట్టం (2000) లోని వివిధ సెక్షన్లకింద చైనాపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని సైబర్ సెల్ విభాగాన్ని ఆదేశించాల్సిందిగా కూడా ఈ సంస్థ సభ్యులు విజ్ఞప్తి చేశారు. డ్రాగన్ కంట్రీ సైబర్ టెర్రరిజానికి, సైబర్ నేరాలకు పాల్పడుతోందని పేర్కొన్నారు.
పైగా ఇండియాలో చైనా నిర్వహిస్తున్న డిజిటల్ మనీ లెండింగ్ యాప్ లను నిషేధించవలసిందిగా కూడా వీరు అభ్యర్థించారు. ఫైర్ కోడ్ ప్రాక్టీస్ ను అతిక్రమించి జరుగుతున్న నాన్-బ్యాంకింగ్ఫైనాన్షియల్ కంపెనీల డిజిటల్ మనీ లెండింగ్ పై చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. దీనిపై సుప్రీంకోర్టు త్వరలో నిర్ణయం తీసుకోనుంది.