ప్రశ్నపత్రం లీక్ చేస్తే ఇక తప్పించుకోలేరు.. కఠిన శిక్షల బిల్లుపై నేడు పార్లమెంటులో చర్చ

నీట్-యూజీ పరీక్షల పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో మంగళవారం (జూలై 28) కీలక చర్చ జరగనుంది. నీట్ అంశంపై వరుసగా ఆరు రోజుల పాటు పార్లమెంట్‌లో కొనసాగిన ప్రతిష్టంభన అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చకు అంగీకారం కుదరడంతో ఈ బిల్లు సభలో ప్రధాన అజెండాగా మారింది.

ప్రశ్నపత్రం లీక్ చేస్తే ఇక తప్పించుకోలేరు.. కఠిన శిక్షల బిల్లుపై నేడు పార్లమెంటులో చర్చ
Anti Paper Leak Bill In Lok Sabha

Updated on: Jul 28, 2026 | 9:21 AM

నీట్-యూజీ పరీక్షల పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (Prevention of Unfair Means) సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో మంగళవారం (జూలై 28) కీలక చర్చ జరగనుంది. నీట్ అంశంపై వరుసగా ఆరు రోజుల పాటు పార్లమెంట్‌లో కొనసాగిన ప్రతిష్టంభన అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చకు అంగీకారం కుదరడంతో ఈ బిల్లు సభలో ప్రధాన అజెండాగా మారింది.

ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షలలో అక్రమాలు, నకిలీ అభ్యర్థులు, ఓఎంఆర్ షీట్ల తారుమారు వంటి ఘటనలను కట్టడి చేయడమే ఈ సవరణ బిల్లు ప్రధాన లక్ష్యం. ఈ బిల్లును సోమవారం ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే విద్యార్థి నిరసనలపై పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించడంతో చర్చ వాయిదా పడింది. ఇప్పుడు మంగళవారం ఈ బిల్లుపై ఆరు గంటల పాటు చర్చ నిర్వహించాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించగా, అవసరమైతే అదనపు సమయం కూడా కేటాయించనున్నట్లు తెలిపారు.

ఈ బిల్లు ప్రకారం ప్రశ్నపత్రాల లీకేజీ లేదా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. నేర తీవ్రతను బట్టి ఈ శిక్షను పదేళ్ల వరకు పెంచే అవకాశం ఉంటుంది. అలాగే గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా విధించే నిబంధనను ప్రతిపాదించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలో మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, గరిష్టంగా రూ.10 లక్షల జరిమానా మాత్రమే ఉండగా, కొత్త సవరణతో శిక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు.

వ్యవస్థీకృతంగా పరీక్షల అక్రమాలకు పాల్పడే ముఠాలు, సంస్థలపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా బిల్లు రూపుదిద్దుకుంది. అలాంటి కేసుల్లో కనీస శిక్షను ఏడేళ్లకు పెంచడంతో పాటు, గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం కల్పించారు. పరీక్షలు నిర్వహించే సేవా సంస్థలు నేరాలకు పాల్పడితే వాటిపై గరిష్టంగా రూ.5 కోట్ల జరిమానా విధించడంతో పాటు, ప్రభుత్వ పరీక్షలు నిర్వహించే అర్హతను నాలుగేళ్ల స్థానంలో ఎనిమిదేళ్ల వరకు రద్దు చేసే నిబంధనను కూడా చేర్చారు.

పరీక్షల అవకతవకలపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక విధానాలు కూడా ఈ బిల్లులో ఉన్నాయి. పేపర్ లీక్ కేసుల దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాలని, ఛార్జిషీట్ దాఖలు చేసిన మూడు నెలల్లోగా విచారణ ముగించేలా ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వనున్నారు. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాలు (టాస్క్ ఫోర్స్), ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే వెసులుబాటు కూడా కేంద్రానికి ఉంటుంది.

అదేవిధంగా బయోమెట్రిక్ నమోదు, అభ్యర్థుల చెక్-ఇన్, ప్రశ్నపత్రాల భద్రత, పర్యవేక్షణ, పరీక్షా కేంద్రాల నిర్వహణ వంటి అంశాలకు స్పష్టమైన నిబంధనలు తీసుకురానున్నారు. ప్రశ్నపత్రాల లీక్, ఓఎంఆర్ షీట్ల తారుమారు, నకిలీ అడ్మిట్ కార్డులు జారీ చేయడం, నకిలీ వెబ్‌సైట్లు సృష్టించడం వంటి 15 రకాల అక్రమాలను ప్రత్యేక నేరాలుగా గుర్తించారు.

నీట్ పేపర్ లీక్ ఘటన తర్వాత పరీక్షల విశ్వసనీయతపై తలెత్తిన సందేహాలకు చెక్ పెట్టేందుకు ఈ సవరణ బిల్లు తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. రాజకీయ భేదాభిప్రాయాల మధ్య కూడా పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ బిల్లుపై జరగనున్న చర్చకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us