మధుర, ఆగస్టు 27: కృష్ణాష్టమి పండగ పూట ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చేసిన పిండి వంటలు తిన్న పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 120 మందికిపైగా భక్తులు వాంతులు, కడుపులో మంటతో ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని పర్ఖామ్ గ్రామస్థులు స్థానిక దుకాణంలో బక్‌వీట్ అనే గోదుమలను పోలిన గింజల పిండిని కొనుగోలు చేశారు. ఆ పిండితో వడలు తయారు చేసుకొని తిన్నారు. వాటిని తిన్న కాసేపటికే చిన్నారులు, మహిళలు సహా సుమారు 120 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపులో మంటతో ఇబ్బంది పడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రుల్లో చేరారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి మథురలోని ఫరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో అనుమానాస్పద ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటు చేసుకున్నాయని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. వడలు తిన్న తర్వాత తలతిరగడం, వాంతులు అవుతున్నట్లు తమకు ఫిర్యాదు చేశారని పర్‌ఖామ్ గ్రామానికి చెందిన బాధితులు వైద్యులకు తెలిపారు. కొందరు ఏకంగా స్పృహ కోల్పోయి పడిపోయారు కూడా. వడల తయారీకి వినియోగించిన పిండి గ్రామంలోని స్థానికంగా ఉన్న ఓ దుకాణం నుంచి కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు.
VIDEO | Uttar Pradesh: At least 50 people were taken ill after they consumed buckwheat (Kuttu) flour during Janmashtami celebrations in #Mathura.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/7fZcToSba0
— Press Trust of India (@PTI_News) August 27, 2024
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత వ్యక్తులు చాలా మంది జన్మాష్టమి సందర్భంగా ఉపవాసం ఉన్నారు. పిండితో చేసిన ‘వడలె’, ‘పకోడీలు’ తిన్న తర్వాత వణుకు, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. బాధితులు పెరగడంతో వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఆగ్రాలోని ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 43 మంది, మధురలోని జిల్లా ఆసుపత్రిలో 29 మంది, 100 పడకల కంబైన్డ్ హాస్పిటల్‌లో 15 మంది, బాబా జైగురుదేవ్ ఛారిటబుల్ హాస్పిటల్‌లో 15 మంది రోగులు చేరినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సిఎంఓ) డాక్టర్ అజయ్ కుమార్ వర్మ తెలిపారు. బాధితులంగా పర్‌ఖామ్, బరోడా, మీర్జాపూర్, మఖ్దూమ్, ఖైరత్ గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఫరాలోని కిరాణా దుఖాణం నుండి పిండిని కొనుగోలు చేశారు. ఫరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో రాత్రిపూట ఫుడ్ పాయిజనింగ్‌పై ఫిర్యాదులు అందాయని ఆరోగ్య శాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ భూదేవ్ ప్రసాద్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ సింగ్, జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. సదరు కిరాణా దుకాణాలపై దాడి చేసి సీల్ చేయాలని ఆదేశించారు. ఆ ప్రాంతంలోని దుకాణాల నుంచి వీకె శాంపిల్స్ సేకరించారు