తాను గొప్ప జడ్జీని కాకపోవచ్చు కానీ, సామాన్యూడికి న్యాయం అందించడానికి కృషి చేశానని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. పదవీకాలం ముగిసిన సీజేఐ ఎన్వీ రమణ 16 నెలలకు పైగా సీజేఐగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్నారు. శుక్రవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ ఆసోసియేషన్ ఆయనను శుక్రవారం ఘనంగా సన్మానించింది. ఎన్వీ రమణ తన వీడ్కోలు ప్రసంగంలో మాట్లాడుతూ న్యాయవ్యవస్థ సామాన్య ప్రజానీకానికి దూరంగా ఉందనేది ప్రజల విశ్వాసమని అన్నారు. జీవితంలో తనకు విద్య నేర్పిన గురవులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటానని అన్నారు. తన జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు. 12 ఏళ్ల వయసులో తొలిసారి కరెంటు చూసినట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లకు ట్రేడ్ యూనియన్‌కు నేతృత్వం వహించానని తెలిపారు. ఈ వృత్తిలో అనేక ఒడిదొడుకులు వస్తాయని న్యాయవాదులు గ్రహించాలని సూచించారు. కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం మొదలైందని.. వృత్తి పరంగా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు.
అయితే.. భారత న్యాయవ్యవస్థ సాధారణ ప్రజలకు ఎంతో దూరంలో నిలిచిందన్నారు. ఇప్పటికీ కోట్ల మంది ప్రజలకు న్యాయ సహాయం అవసరం ఉందని గుర్తు చేశారు. అవసరమైనప్పుడు న్యాయ వ్యవస్థను ఆశ్రయించడానికి ఇంకా వారు భయపడుతూనే ఉన్నారని అన్నారు. న్యాయవ్యవస్థ తన అభిప్రాయాలను మీడియాలో ఉంచడం లేదన్నారు. న్యాయవ్యవస్థ రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ మీడియాలో తగిన ప్రచారాన్ని పొందలేదని తనకు అనుభవపూర్వకంగా అర్థమైందన్నారు.
మీడియా సాధారణ ప్రజలకు న్యాయవ్యవస్థ సమాచారాన్ని చేరవేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు రాజ్యాంగంపై అవగాహన లేకుండా పోతోంది. న్యాయవ్యవస్థ చుట్టూ అవగాహన, నమ్మకాన్ని ఏర్పరచడం ద్వారా ఈ అవగాహనలను తొలగించి రాజ్యాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం నా రాజ్యాంగ కర్తవ్యం. నా ప్రయత్నం న్యాయం అందించడమే కాదు, దేశ ప్రజలకు అవగాహన కల్పించడం కూడా అని ఎన్వీ రమణ అన్నారు.
16 నెలల పాటు సీజేఐగా పనిచేశారు
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. శనివారం 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్‍లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగుతారు. ఏడాది నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది.
పదవీ విరమణ చేసిన CJI వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ UU లలిత్ మాట్లాడుతూ, 74 రోజుల నా తదుపరి ఇన్నింగ్స్‌లో ఈ 3 ప్రాంతాలను ఉంచాలనుకుంటున్నాను. ముందుగా, జాబితాను సరళంగా, స్పష్టంగా , పారదర్శకంగా చేయడానికి కృషి చేస్తాను అని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం