PM Modi: మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం..

శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్ చేపట్టి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరుల రక్తానికి ప్రతీకారంగా, సరిహద్దులు దాటి భారత్ జరిపిన ఈ మెరుపు దాడులతో శత్రువులు గజగజ వణికిపోయారు. ఏడాది పూర్తైన తరుణంలో ప్రధాని మోదీ మన సైన్యం పరాక్రమాన్ని కొనియాడారు.

PM Modi: మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం..
Pm Modi Message On Operation Sindoor

Updated on: May 07, 2026 | 9:54 AM

దేశ భద్రతా చరిత్రలో ఒక నవ శకాన్ని లిఖించిన ఆపరేషన్ సింధూర్‌కు నేటితో ఏడాది పూర్తైంది. పహల్గామ్ నెత్తుటి గాయానికి ప్రతీకారంగా, శత్రువుల గుండెల్లోకి దూరి భారత్ జరిపిన ఈ మెరుపు దాడికి ఏడాది పూర్తవడంతో దేశం మొత్తం సైన్యం పరాక్రమాన్ని గుర్తు చేసుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైనికుల ధైర్యసాహసాలను కొనియాడారు. ‘‘ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న ప్రతి ఒక్క సైనికుడికి దేశం రుణపడి ఉంటుంది. అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో, క్లిష్ట సమయాల్లో అచంచలమైన పట్టుదలతో శత్రువులను వేటాడిన మన దళాల పోరాట పటిమ అనన్యసామాన్యం’’ అని ఆయన అన్నారు. కేవలం సైనిక చర్యగానే కాకుండా దేశ ప్రజల్లో భద్రతా భావాన్ని నింపడంలో ఈ ఆపరేషన్ కీలక పాత్ర పోషించిందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియాలో సింధూర్ గర్జన

ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ తన X (ట్విట్టర్) ప్రొఫైల్ ఫోటోను ఆపరేషన్ సింధూర్ చిహ్నంగా మార్చడం విశేషం. అటు భారత వాయుసేన విడుదల చేసిన సరికొత్త వీడియో ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. “భారత్ దేనినీ క్షమించదు” అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఈ వీడియోలో.. ఉగ్రవాద శిబిరాలను మన దళాలు ఎలా నామరూపాలు లేకుండా చేశాయో కళ్లకు కట్టినట్లు చూపించారు.

నాడు విషాదం.. నేడు విజయగీతం

2025 ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసారన్ లోయలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడి భారత సార్వభౌమాధికారాన్ని సవాలు చేసేలా ఉండటంతో భారత సైన్యం మే 7న అత్యంత వ్యూహాత్మకంగా ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. పాకిస్థాన్, PoKలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించడంలో ఆధునిక సాంకేతికతను వాడారు. సరిహద్దులు దాటి మరీ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసి శత్రువులకు కోలుకోలేని దెబ్బ తీశారు. అంతర్గత భద్రత విషయంలో భారత్ ఎక్కడా రాజీ పడదని ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us