Viral Video: పట్టపగలు దారుణం.. బిజీ రోడ్డుపై సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్‌! చోద్యం చూసిన జనాలు

పట్టపగలు, నడిరోడ్డుపై ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు ఓ యువతిని కిడ్నాప్‌ చేశారు. స్కూటీపై వచ్చిన దుండగులు యువతి కారును అడ్డగించి, ఆమెను బలవంతంగా బయటకు లాగి స్కూటీపై ఎత్తుకుపోయారు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అత్యంత బిజీగా ఉండే దాల్‌ బజార్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అసలేం జరిగిందంటే..

Viral Video: పట్టపగలు దారుణం.. బిజీ రోడ్డుపై సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్‌! చోద్యం చూసిన జనాలు
Woman Kidnaped In Dramatic Sequence In Maharashtra

Updated on: Jan 23, 2026 | 4:54 PM

భోపాల్‌, జనవరి 23: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గురువారం ఉదయం అత్యంత రద్దీ ప్రాంతమైన దాల్ బజార్‌లో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు 2 స్కూటీలపై వచ్చారు. ఆ తర్వాత అదే రోడ్డుపై వస్తున్న ఓ కారును అడ్డగించి, కారు ముందు స్కూటీని నిలిపి రోడ్డు మధ్యలో కారు ఆపారు. కారు వెనుక డోర్‌ తెరువాలని డిమాండ్‌ చేశారు. అందులోని వారు నిరాకరించడంతో కారు అద్దాలు పగులకొడతామని హెచ్చరించారు. దీంతో కారు వెనుక డోర్‌ తెరచుకుంది. దుండగులు కారు వెనుక డోరు నుంచి యువతిని బయటకు లాగారు. సంఘటన సమయంలో చుట్టూ జనాలు ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఆమెను చేతులతో విచక్షణా రహితంగా కొట్టారు. అనంతరం ఆమెను బలవంతంగా స్కూటీపై ఎక్కించుకుని ముందు ఒకరు, వెనుక ఒకరు కూర్చున్నారు. మిలిగిన వ్యక్తులు మరో స్కూటీలో అక్కడి నుంచి ఉడాయించారు.

అయితే అత్యంత కలతపెట్టే అంశం ఏమిటంటే.. ఇంత జరుగుతున్నా సదరు కారు డ్రైవింగ్‌ సీటులోని వ్యక్తిగానీ, కారులో ఉన్న ఇతర వ్యక్తులుగానీ ప్రతిఘటించక పోవడం విశేషం. మార్కెట్ వద్ద స్థానికులు వందలాదిగా ఉన్నా ఒకరు కూడా సహాయం చేసేందుకు ముందుకు రావడం జరగలేదు. కనీసం పోలీసులకు కూడా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అందరూ కిమ్మనకుండా చోద్యం చూస్తూ ఉండిపోయారు. దీంతో కిడ్నాపర్లు అత్యంత సులభంగా తమ పని కానిచ్చారు.

ఇవి కూడా చదవండి

సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. యువతిని కిడ్నాప్‌ చేసిన ముసుగు వ్యక్తులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. బాధిత యువతి కుటుంబ సభ్యులు ఇంత వరకు ఫిర్యాదు చేయకపోవడంపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.