ఇకపై గవర్నమెంట్ ఆఫీసుల్లో అనధికారికంగా ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తూ కర్ణాటక సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే బయట వ్యక్తులు.. ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఉంచుతున్నారని.. వాటి వల్ల మహిళా ఉద్యోగుల గౌరవానికి భంగం వాటిల్లుతోందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని బసవరాజు బొమ్మై ప్రభుత్వాన్ని కోరారు.
ఈ విషయంపై లోతుగా చర్చించిన కర్ణాటక సర్కార్.. ఇకపై ఉద్యోగుల పనివేళల్లో ప్రజలు ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తూ శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ ఆదేశాల మేరకు సిబ్బంది, పరిపాలనా విభాగం కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రూల్స్ అతిక్రమించి ఫోటోలు, వీడియోలు తీసేవారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఉత్తర్వుల్లో పేర్కోలేదు.