ఏంటి పైన టైటిల్ చూసి షాక్ తిన్నారా..? అవును ఇది నిజమే.. ఇకపై రేషన్‌లో సబ్సీడీ ద్వారా మాంసాహార పదార్థాలు పంపిణీ చేయాలనుకుంటోందట నీతి అయోగ్. ఇప్పటికే రేషన్ ద్వారా బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, నూనెలు, చక్కెర వంటి సరుకులు అందజేస్తున్నారు. ఇప్పుడు పౌష్టికాహార పదార్థాలను కూడా దేశంలోని ప్రజలకు అందజేయాలని అనుకుంటుందట. దీంతో.. చికెన్, గుడ్లు, చేపలు తదితర మాంసాహర పదార్థాలను ఈ జాబితాలో చేర్చింది. పౌష్టికాహార లోపాన్ని నివారించి.. పేద ప్రజలకు పుష్టికరమైన ఆహారాన్ని వీలైనంత తక్కువ ధరలకే అందజేయాలని ఈ ప్రదిపాదనను తీసుకొచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా చిన్నారులు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని.. ఇలా అయితే చవకగా వారికి లభించే అవకాశం కూడా ఉంటుందని నీతి అయోగ్ భావిస్తోంది.
అయితే.. ఇప్పుడు ఈ చేర్చిన పదార్థాలను ప్రజలకు ఎలా అందించాలి.. దానికి తగిన సాధ్యాసాధ్యాలపై నీతి అయోగ్ తర్జన భర్జనలు పడుతోందట. ఈ సందర్భంగా నీతి అయోగ్య సభ్యుడు రమేష్ చంద్ర మాట్లాడుతూ.. ఇప్పటికే కల్తీ అయిన ఆహార పదార్థాలు తింటూ.. ప్రజలు రోగాబారిన పడుతున్నారని అన్నారు. అలాగే.. బయట మసాలాలు, నూనె, చక్కెరలు తిని బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి రోగాలను కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వాటిపై అనవసర ఖర్చు పెడుతున్నారని.. అదే సబ్సీడీ ద్వారా వీటిని అందిస్తే.. వారికి పుష్టికరమైన ఆహారం అందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా.. ఈ విషయాన్ని చట్టసభ్యుల్లో కూడా అవగాహన కల్పించేలా.. విజన్ డాక్యుమెంట్‌లో ప్రస్తావిస్తామని వెల్లడించారు. ఇప్పటికే పీడీఎస్ ద్వారా సబ్సీడీపై ప్రజలకు ఆహార పదార్థాలను అందించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఖర్చుపెడుతున్నాయి. అయితే… ఇప్పుడు ఈ మాంసాహార పదార్థాలు కూడా చేర్చడంతో.. ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశాలున్నందున.. ప్రస్తుతం ఇస్తున్న వస్తువుల్లో ఒకటి లేదా రెండు, మూడు పదార్థాలను తగ్గించి.. వాటి ప్లేస్‌లో వీటిని అందిస్తే బాగుంటుందని అన్నారు. అయితే.. ఈ మాంసాహార పదార్థాలు సబ్సీడీపై ఎలా ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? రేషన్ షాపుల ద్వారా వీటిని ఎలా పంపిణీ చేయాలనే దానిపై కూడా నీతి అయోగ్.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తుందని రమేష్ చంద్ర తెలిపారు.