
దేశంలో రాబోయే హై-స్పీడ్ జాతీయ రహదారుల రూపకల్పనలో కీలక మార్పులు తీసుకురావడానికి NHAI కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ (MLFF) విధానాన్ని అమలు చేసేలా హైస్పీడ్ కారిడార్లను ఏర్పాట్లు చేసేందుక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విధానంలో FASTag, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వంటి సాంకేతికతల ద్వారా వాహనాలు కదులుతూనే టోల్ వసూలు చేయనున్నారు. NHAI ఇప్పటికే గుజరాత్‌లోని NH-48పై MLFF విధానాన్ని అమలు చేసింది.
ఈ మార్గదర్శకాలు రాబోయే నాలుగు, ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ యాక్సెస్-కంట్రోల్డ్ హైస్పీడ్ జాతీయ రహదారులకు వర్తించనున్నాయి. అయితే ఎక్స్‌ప్రెస్‌వేలు వీటి పరిధిలోకి రావు. భవిష్యత్ ట్రాఫిక్‌ను అంచనా వేయడంలో ప్రస్తుత వాహన రాకపోకలతో పాటు ఇతర మార్గాల నుంచి మళ్లే ట్రాఫిక్, సరుకు రవాణా వృద్ధి, టోల్ డేటా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని NHAI సూచించింది. రోడ్ల నిర్మాణంలో ఆటోమేటెడ్, ఇంటెలిజెంట్ మెషిన్-ఎయిడెడ్ కన్స్ట్రక్షన్ (AI-MC) సాంకేతికతను వినియోగించనున్నారు. దీంతో నిర్మాణ నాణ్యత, కచ్చితత్వం, పర్యవేక్షణ మెరుగుపడే అవకాశం ఉంది.
అదే సమయంలో హైవేలలో పచ్చదనం, నీటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మధ్యభాగాలు, ఫ్లైఓవర్ల కింద, లూప్ ప్రాంతాల్లో స్థానిక వాతావరణానికి అనుగుణంగా మొక్కలు నాటడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. వర్షపు నీటి నిర్వహణకు డ్రైనేజీ, నీటి సేకరణ వ్యవస్థలను ప్రాజెక్ట్ ప్రణాళిక దశలోనే చేర్చాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.
మొత్తంగా టోల్ వసూళ్లలో వేగం, రహదారి నిర్మాణంలో సాంకేతికత, ట్రాఫిక్ ప్రణాళిక, పచ్చదనం, డ్రైనేజీ వంటి అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ హైస్పీడ్ జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని NHAI లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..