కేరళను మరోసారి వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచేశాయి. వయనాడ్ లోని వరద బీభత్సానికి చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే పైకి నీళ్లు చేరడంతో విమాన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లే ఆయా సంస్థలకు చెందిన విమాన సర్వీసులు మూడు రోజుల వరకు రద్దు చేశారు. కేరళలోని స్కూళ్లకు ఇప్పటికే విద్యాశాఖ సెలవు ప్రకటించింది. కేరళవ్యాప్తంగా పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. మొత్తం ఏడు జిల్లాల్లో కుండ పోత వర్షం కురుస్తుండటంతో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. అధికారులంతా సహాయక చర్యల్లో తలమునకలయ్యారు.
భారీ వర్షాలు,వరదల నేపథ్యంలో కేరళ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. మలప్పురం ప్రాంతంలో సీసీ కెమెరాలో రికార్డైన ఓ భయానక విజువల్స్ కేరళపై ప్రకృతి విలయ తాండవం చేస్తుందనటానికి సాక్షంగా నిలిచింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వర్షం కురుస్తుండటంతో ఓ వ్యక్తి గొడుగు పట్టుకుని తల్లితో పాటు నడుస్తున్నాడు. ఒక్కసారిగా సునామీలా దూసుకువచ్చిన మట్టిపెళ్లల ప్రవాహం ఆ తల్లి కొడుకుల్ని చెల్లా చెదురు చేసింది. ఓ భవనం పైకి చేరిన అతడు ప్రాణాలతో బయటపడగా..అతని తల్లి మట్టి ప్రవాహంలో కనిపించకుండా పోయింది. తీరా ఇంటికి చేరిన అతడికి మరో షాక్ తగిలింది. ముంచుకువచ్చిన ప్రళయం అతడి భార్య పిల్లలతో సహా వారి ఇంటిని కూడా ముంచేసింది. జరిగిన ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఎంతగాలించిన అతడి భార్య బిడ్డల జాడ కానరాలేదు. భారీ స్థాయిలో కుప్పకూలిన మట్టిపెళ్లలు, చెట్లు పైన బడటంతో వారు బతికే అవకాశాలు లేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
గత మూడు రోజులుగా వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ప్రాణాలు విడిచినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. కేరళతోపాటు కర్నాటక, మహారాష్ట్రలలో కూడా భారీ వర్షాలు కురిసి, వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల వల్ల మూడు రాష్ట్రాల్లో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మరో రెండ్రోజులు ఇలాగే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
On Video, Kerala Man’s Narrow Escape From Mudslide https://t.co/OcTiFxozU6 #NDTVNewsBeeps pic.twitter.com/ACSCCTIgyR
— NDTV (@ndtv) August 10, 2019