గాంధీ కుటుంబానికి కేంద్రం షాక్..

|

Nov 09, 2019 | 9:30 AM

గాంధీ కుటుంబానికి మోదీ ప్రభుత్వం షాకిచ్చింది. సోనియా, రాహుల్, ప్రియాంక వధేరాలకు ప్రస్తుతం వున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న భద్రతను ఉపసంహరించింది. ఆ స్థానంలో జడ్+సెక్యూరిటీని కల్పించాలని నిర్ణయించింది. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన రిపోర్టు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. తొలి ప్రధాని నెహ్రూ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజా క్షేత్రంలోనే కొనసాగుతూ దాదాపు 50 ఏళ్ళకు పైబడి దేశాన్ని శాసిస్తున్న గాంధీ/నెహ్రూ కుటుంబంలో తొలి నుంచి అత్యంత […]

గాంధీ కుటుంబానికి కేంద్రం షాక్..
Follow us on

గాంధీ కుటుంబానికి మోదీ ప్రభుత్వం షాకిచ్చింది. సోనియా, రాహుల్, ప్రియాంక వధేరాలకు ప్రస్తుతం వున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న భద్రతను ఉపసంహరించింది. ఆ స్థానంలో జడ్+సెక్యూరిటీని కల్పించాలని నిర్ణయించింది. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన రిపోర్టు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

తొలి ప్రధాని నెహ్రూ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజా క్షేత్రంలోనే కొనసాగుతూ దాదాపు 50 ఏళ్ళకు పైబడి దేశాన్ని శాసిస్తున్న గాంధీ/నెహ్రూ కుటుంబంలో తొలి నుంచి అత్యంత భద్రతావలయంలో కొనసాగుతూ వస్తుంది. నిజానికి ఇందిరాగాంధీ స్వయంగా వున్నప్పుడు ఆమె అత్యంత నిరాడంబరంగా వుండేవారని చెబుతారు. తాను నివసించిన నెంబర్ 1, సఫ్దర్‌జంగ్ రోడ్ నివాసంలో అత్యంత నిరాడంబరంగా పెద్దగా సెక్యూరిటీ లేకుండానే నివసించేవారు. ఆమె నివాసం ముందు నుంచి వెళ్ళే వారకి సైతం ఇందిరాగాంధీ తన నివాసం లాన్‌లో వాకింగ్ చేస్తూ కనిపించేవారని చెప్పుకుంటారు. అయితే.. 31 అక్టోబర్, 1984న ఇందిరా గాంధీ ఆమె సెక్యూరిటీ సిబ్బంది సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌ల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె నివాసాన్ని ఇందిరాగాంధీ మ్యూజియంగా మార్చేశారు.

ఆ తర్వాత నాలుగున్నరేళ్ళ పాటు ప్రధానిగా వున్న రాజీవ్ గాంధీ కూడా పెద్దగా సెక్యూరిటీ లేకుండానే వుండేవారంటారు. కానీ ఆయన 1991 మే 21న చెన్నై సమీపంలోని శ్రీపెరుంబుదూరులో ఎల్టీటీఈ తీవ్రవాదుల చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురికావడంతో గాంధీ కుటుంబానికి రక్షణ వలయం ఒక్కసారిగా భారీ స్థాయిలో పెరిగిపోయింది. 1991లో అనూహ్యంగా ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పి.వి. నరసింహారావు ఒక దశలో సోనియా గాంధీ కుటుంబానికి భద్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తే.. కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే చెలరేగింది. దాంతో ఆ తర్వాత ప్రభుత్వాలేవీ సోనియా కుటుంబానికి భద్రతను ఉపసంహరించేందుకు యత్నించలేదు.

తాజాగా విపక్షంలో వున్న కాంగ్రెస్ నేతలకు పెద్దగా సెక్యూరిటీ థ్రెట్ లేదన్న ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వధేరాలకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సెక్యూరిటీని ఉపసంహరిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వీరికి ఇక నుంచి జడ్+ కేటగిరీలో సెక్యూరిటీ కల్పిస్తారు. అయితే.. గాంధీ కుటుంబానికి సెక్యూరిటీని తగ్గించడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ రాహుల్ గాంధీ స్వయంగా ఇంతకాలం తమకు రక్షణ కల్పించినందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కి కృతఙ్ఞతలు తెలియచేస్తూ లేఖ రాశారు.