
మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో నిలిచారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె ప్రతిష్ఠాత్మక జాతీయ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుత మిస్ యూనివర్స్ ఇండియా 2025 మణికా విశ్వకర్మ.. కజియాకు కిరీటం తొడిగి, అధికారికంగా తన వారసురాలిగా ప్రకటించారు.
జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన కజియా లిజ్ మెజోకు మరో కీలక అవకాశం దక్కింది. నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరఫున ఆమె పాల్గొననున్నారు. దీంతో దేశంలోని అందాల పోటీల చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు కజియాకు అవకాశం లభించింది.
మిస్ యూనివర్స్ ఇండియా 2026 పోటీలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆడిషన్లు, ఇంటర్వ్యూలు, ప్రాథమిక పోటీల అనంతరం 52 మంది ఫైనలిస్టులు తుది దశకు చేరుకున్నారు. చివరి రౌండ్లలో వివిధ విభాగాల్లో పోటీదారులను పరీక్షించిన అనంతరం కజియా లిజ్ మెజో విజేతగా ఎంపికయ్యారు. తుది ఫలితాల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్ రెండో స్థానంలో నిలవగా, గుజరాత్‌కు చెందిన అనుశ్రీ సతావలేకర్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
#WATCH | Jaipur, Rajasthan | Grand Finale of Miss Universe India 2026 | Miss Universe India 2026 Winner Kaziah Liz Mejo says, “I feel so on top of the world. This is such an iconic moment, and the moment that I have worked for over three years now. I am so incredibly happy that I… pic.twitter.com/6IdSF1bpM3
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 24, 2026
ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్‌కు ప్రముఖులైన జ్యూరీ సభ్యులు హాజరయ్యారు. 1994లో భారత్ తరఫున తొలిసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న సుష్మితా సేన్ జ్యూరీకి నాయకత్వం వహించారు. మాజీ మిస్ యూనివర్స్ ఇండియా విజేతలు సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలా, రియా సింఘాతో పాటు ప్రజ్ఞా కపూర్, విషా లధియా, అన్నా బ్లాంకో, డాక్టర్ స్టుటి ఖరే శుక్లా తదితరులు జ్యూరీ ప్యానెల్‌లో ఉన్నారు. కజియా లిజ్ మెజో విజయంతో కేరళకు చెందిన ఈ యువతి జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ఆమె దృష్టి అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంపైనే ఉంది. నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరిగే పోటీలో ఆమె ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.